
పారదర్శకంగా టెన్త్ మూల్యాంకనం
● కలెక్టర్ దినేష్ కుమార్
సాక్షి, పాడేరు: టెన్త్ మూల్యాంకనాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ సూచించారు. స్థానిక తలారిసింగి పాఠశాలలోని టెన్త్ మూల్యాంకన కేంద్రాన్ని ఆయన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, మూల్యాంకనం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా మూల్యాంకనాన్ని కూడా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కేంద్రంలోని గదుల్లో లైటింగ్, తాగు నీరు, ఇతర సదుపాయాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. విత్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేసిన జనరేటర్ పరిశీలించారు. సుమారు 650 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొన్నారని, రేపటితో ఓపెన్ స్కూల్ పరీక్షల మూల్యాంకనం పూర్తవుతుందని, రెగ్యులర్ పదవ తరగతి మూల్యాంకనం మరో మూడు రోజుల పాటు జరుగుతుందని కలెక్టర్‌కు డీఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీ రావు, పరీక్షల సహాయ కమిషనర్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు