మరింతగా ఎకో టూరిజం అభివృద్ధి
అరకులోయటౌన్: ఎకో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన ప్రాజెక్టులు మరిన్ని రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మండలంలోని సుంకరమెట్ట కాఫీ తోట ల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం ప్రాజెక్టు కింద రూ.19 లక్షలతో నిర్మించిన చెక్క వంతెనను ఆయన మంగళవారం ప్రారంభించారు. అరకులో య పర్యటనలో భాగంగా రెండో రోజు చెక్క వంతెనను ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరే షన్ చైర్మన్ ఆర్.పి.సుజయకృష్ణ రంగారావుతో కలిసి కాఫీ తోటల్లో మొక్కలు నాటిన పవన్ కల్యాణ్, అనంతరం కాఫీ తోటల్లో ఆ వంతెనపై కెనోఫీ వాక్ ప్రారంభించారు. వంతెనపై ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్‌లను, ఏపీ అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. ఈ సందర్బంగా అరకుడీలైట్ కాఫీ బ్రాండ్ ప్రమోషన్‌తోపాటు సుంకరమెట్ట ఎకో టూరిజం పోస్టర్లు, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ కజూరియా, విశాఖ రిజన్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ జ్యోతి తుల్లిమెల్లి, కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్, సర్పంచ్ గెమ్మెలి చినబాబు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించిన వలంటీర్లు
అరకులోయ పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు ఆయన బస చేసిన అరకులోయ రైల్వే అతిథి గృహం వద్దకు సోమవారం రాత్రి వెళ్లిన వలంటీర్లను పోలీసులు అనుమతించలేదు. మంగళవారం ఉదయం వలంటీర్లు మళ్లీ ప్రయత్నించి, పవన్ కల్యాణ్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో స్పందించిన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మీ ఉద్యోగంపై ప్రభుత్వం ఎటువంటి జీవో జారీ చేయలేదని, ఎటువంటి జీవోలు లేకుండా గత ప్రభుత్వం మిమ్మల్ని నియమించిందన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తానని పవన్ చెప్పారు.


