
ఏయూలో గాడితప్పిన బిజినెస్
● ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’పై ప్రభుత్వ నిర్లక్ష్యం ● రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక చదువులు తిరోగమనం ● రిటైర్ అయిన ఆచార్యుడికి డైరెక్టర్ పగ్గాలు ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అందలం ● వీసీ నిర్ణయాలపై విస్మయం
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’ గాడి తప్పుతోంది. కూటమి ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు మేలు చేసేలా తీసుకుంటున్న నిర్ణయాలతో ఏయూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చిన ప్రాధాన్యతతో అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 2021–22 విద్యా సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హాస్పటాలిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో బీబీఏతో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేసుకునేలా ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభించింది.
చదువులు తిరోగమనం
సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద రూసా నిధులతో ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’ను ఏయూలో ప్రారంభించారు. తరగతుల నిర్వహణలో భాగంగా కాంట్రాక్టు పద్ధతిన సీనియర్ ఆచార్యులు, అవసరమైన మేరకు అతిథి అధ్యాపకులను నియమించారు. ప్రభుత్వ ఆమోదంతో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రయత్నాలు చేశారు. ఈలోగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ప్రసాద్‌రెడ్డిని వీసీ పదవి నుంచి తప్పించటం జరిగిపోయాయి. కానీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలపై ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదు. అంతా అతిథి అధ్యాపకులే కావటంతో ఇక్కడ చదువులు సవ్యంగా సాగటం లేదు. ఈ కారణంగానే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ చదువుల స్టాండర్డ్ తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. బాధ్యతాయుతంగా పాఠాలు చెప్పేవారు లేకపోతే, పరిస్థితి ఇలానే ఉంటుందని ఇక్కడి ఆచార్యులు సైతం అంగీకరిస్తున్నారు.
ఉద్యోగ విరమణ చేసిన ఆచార్యుడికి కీలక బాధ్యత
ఉద్యోగ విరమణ చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించకూడదనేది యూజీసీ నిబంధన. తాము అధికారంలోకి వస్తే, రిటైర్ అయిన వారందరినీ యూనివర్సిటీ నుంచి సాగనంపుతామని కూటమి పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. కానీ ఏయూకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్న స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ పగ్గాలు రిటైర్ అయిన ఆచార్యుడికి అప్పగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇన్‌చార్జ్ వీసీ శశిభూషణ రావు హయాంలో కూటమి పెద్దల సిఫార్సుతోనే నియామకం జరిగినట్లు ప్రచారం సాగింది. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ హయాంలోనూ అదే వ్యక్తికి డైరెక్టర్‌గా కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడంపై వర్సిటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉద్యోగ విరమణ చేసిన ఓ ఆచార్యుడు సైతం ఇక్కడ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రసాద్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం, ఆయన హయాంలో ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌ను నిర్వీర్యం చేయనుందా..? అనే అనుమానాలు సైతం ఆచార్యులు వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ విద్యార్థులతో క్రేజ్
స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ‘ఆంధ్ర యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్’గా మారింది. ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో డిగ్రీ, పీజీ చేసే అవకాశం ఉండటంతో ఇక్కడ చదివేందుకు విదేశీ విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. విదేశీ ఎంబసీ ఆమోదంతో ఇంటర్నేషనల్ వ్యవహారాలు చూసే విభాగం ద్వారా ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో చేరే వారిలో 40 శాతం మంది విద్యార్థులు ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. అన్ని కోర్సులు కలుపుకొని 350 మందితో ప్రారంభమైన కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఈ మూడేళ్ల కాలంలో 586కు చేరింది. చైన్నెకి చెందిన లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ మేనేజ్‌మెంట్‌తో ఎంవోయూ చేసుకోవడంతో ఇక్కడ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.