
జాబితాలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం
ఈ జిల్లాల్లో 51 కరువు మండలాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం..
37 మండలాల్లో తీవ్రంగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు
అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17 కరువు మండలాలు.. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 10 చొప్పున..
సాక్షి, అమరావతి: వర్షాలు లేక, పంటలు పండక ఆరు జిల్లాల్లో కరువు తాండవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఖరీఫ్ సీజన్‌లోనూ ప్రభుత్వం 49 కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్‌లో వాటి సంఖ్య ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఆరు జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో కరువు ఉన్నట్లు నిర్ధారించింది. వాటిలోని 37 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది.
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఈ మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్ జిల్లాలో 10 తీవ్ర కరువు, కరువు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అనంతపురం జిల్లాలో 7, నంద్యాల జిల్లాలో 5, శ్రీ సత్యసాయి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర కరువు, కరువు పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. లోటు వర్షపాతం, ఎండిపోయిన పంటల పరిస్థితితో పాటు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెవెన్యూ శాఖ కరువు మండలాలను నిర్ధారించింది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.