
నేడు దక్షిణాంధ్ర – తమిళనాడు మధ్య బలహీనపడనున్న అల్పపీడనం
3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు
దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు
పెరగనున్న చలి తీవ్రత
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ మొత్తం సముద్రంలోనే జరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం మరో 3 రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తగ్గే సూచనలున్నాయని వెల్లడించారు. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
ఎగసి పడుతున్న అలలు
వాకాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మంగళవారం తిరుపతి జిల్లా సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో అలలు 5 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి.