
కణత వద్దే పుర్రెలో సున్నిత భాగం
మెదడుకు రక్తప్రసరణ ప్రధాన నరం అక్కడే
‘సాక్షి’తో న్యూరోసర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆయన తలలో అత్యంత సున్నిత ప్రాంతంలో గాయమైందని.. గాయమైన చోటు నుంచి సుమారు ఒకటిన్నర – రెండున్నర సెంటిమీటర్లు వెనుక భాగాన అదే దెబ్బ తగిలి ఉంటే ఊహకు అందని రీతిలో ప్రాణాపాయం సంభవించేదని గుంటూరు జీజీహెచ్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కపాలం(తల) ప్రధానంగా నాలుగు భాగాలైన ఎముకలతో కూడి ఉంటుందన్నారు.
ఇందులో నుదురు భాగం (Frontal Bone), వెనుక భాగం (Parietal Bone).. మెడను కలుపుతూ దిగువ భాగాన టెంపోరల్ బోన్ (Temporal Bone).. ఈ మూడింటికి మధ్యలో అన్నింటిని కలుపుతూ స్పెనాయిడ్ బోన్ ( Sphenoid Bone) ఉంటాయని తెలిపారు. మొత్తం కపాలంలో కల్లా బలహీనమైంది.. టెరియన్ (Pterion) అని వివరించారు. ఈ భాగాన్నే వాడుకలో కణతగా పిలుస్తుంటారన్నారు. ఇక్కడే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే అతి ముఖ్యమైన ప్రధాన రక్తనాళం ఉంటుందన్నారు. దీన్నే మిడిల్ మెనింజియల్ ఆర్టిరీ (Middle Meningeal Artery) అంటారని వివరించారు.
ఇక్కడ ఒక మోస్తరు దెబ్బ తగిలినా.. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళానికి ప్రమాదం సంభవిస్తుందన్నారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరుగుతుందని చెప్పారు. మెదడులోనూ రక్తస్రావం అవుతుందన్నారు. దీన్నే ఎపిడ్యూరల్ హెమటోమా (Epidural Hematoma) అంటారని తెలిపారు. ఇలా జరిగితే మెదడుకు రక్తప్రసరణ ఆగిపోతుందని.. కణత వద్ద దెబ్బ తగిలితే వెంటనే స్పృహ కోల్పోయి కోమాలోకి జారుకోవచ్చన్నారు. ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు.
సీఎం జగన్‌కు గాయమైన చోట నుంచి కేవలం ఒకటిన్నర– రెండున్నర సెంటిమీటర్ల వెనకభాగాన కణత వద్ద అదే దెబ్బ తగిలి ఉంటే ప్రమాద తీవ్రత అంచనాకు అందకుండా ఉండేదని వివరించారు. ఎందుకంటే సాధారణంగా నుదిటి భాగాన చర్మం బిగుతుగా ఉంటుందన్నారు. ఆ ప్రాంతంలో ఎముక తప్ప కండ ఉండదని చెప్పారు. అక్కడే అంత లోతున రక్తగాయం అయ్యిందంటే.. అదే దెబ్బ కణత వద్ద తాకి ఉంటే పెద్ద ప్రమాదం తలెత్తేదని వివరించారు.