
కర్నూలు జిల్లాలో ఫినాయిల్ తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
కోడుమూరు రూరల్: కోర్టులో న్యాయ పోరాటం చేసి సాధించుకున్న నాలుగెకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన చాకలి పెద్ద సవారన్నకు ఇద్దరు భార్యలు.
రెండో భార్య రాములమ్మ కుమార్తె హైమావతికి, మొదటి భార్య సంతానం మధ్య భూముల పంపకంలో వివాదం ఏర్పడి 2011లో కోర్ట్ ను ఆశ్రయించారు. ఏడాది కిందట ఆస్తిలో సగభాగమైన 4ఎకరాల భూమి హైమావతికి చెందుతుందంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.కోర్టు తీర్పు మేరకు తండ్రి నుంచి తనకు సంక్రమించిన 94, 95, 116 సర్వే నంబర్లలోని నాలుగెకరాల భూమిని తన పేరిట ఆన్‌లైన్ చేయాలంటూ హైమావతి కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకుంది.
రెవెన్యూ అధికారులు రూ.లక్ష లంచం అడగ్గా.. ఆ మొత్తం ఇచ్చానని.. డబ్బు తీసుకోవడంతో పాటు తమ పక్కలోకి వస్తేనే సదరు భూమిని ఆన్‌లైన్ చేస్తామని వీఆర్వోలు వేధిస్తున్నారని..రెవెన్యూ అధికారుల వేధింపుల వల్ల తనకు చావే శరణ్యమంటూ మంగళవారం తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తహసీల్దార్ ఆమె చేతిలోని ఫినాయిల్ డబ్బాను లాక్కుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: తహసీల్దార్
ఈ ఘటనపై తహసీల్దార్ వెంకటేష్ నాయక్ వివరణ ఇస్తూ.. కోర్టు తీర్పు హైమావతికి అనుకూలంగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే సదరు భూమి ప్రభుత్వ భూములకు కేటాయించే 20001901 (రెండు కోట్ల) ఖాతాలో ఉన్నందున హైమావతి పేరును ఆన్‌లైన్ అడంగల్‌లో నమోదు చేయడం సాధ్యం కాదన్నారు. కోడుమూరు, పులకుర్తి వీఆర్వోలపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.