
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసగాళ్లు, మోసపూరిత చర్యలు ఎక్కువవుతున్నాయి. స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో.. వాటికి అడ్డుకట్ట వేయడానికి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మొబైల్ యాప్ ప్రారంభించింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మోసపూరిత కమ్యూనికేషన్‌లను సులభంగా రిపోర్ట్ చేయడానికి 'సంచార్ సాథీ' (Sanchar Saathi) మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా అనుమాస్పద కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మొబైల్ ఫోన్ బ్లాక్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
సంచార సాథీ పోర్టల్ 2023లో కేంద్ర టెలికామ్ శాఖ అందుబాటులో తీసుకువచ్చింది. కాగా తాజాగా మొబైల్ యాప్ లాంచ్ చేసింది. దీని ద్వారా మోసాల నుంచి ప్రజలను కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించవచ్చు.
''సంచార్ సాథి యాప్ ఇప్పుడు లైవ్‌లో ఉంది. మీ డిజిటల్ భద్రత కోసం స్కాన్ చేయండి.. అవసరమైన సాధనాలను యాక్సెస్ చేయండి'' అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్వీట్ చేసింది. మొబైల్ యాప్ పరిచయం చేసిన సందర్భంగా.. టెలికామ్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఇది ప్రజల భద్రతను కాపాడే సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు.
SANCHAR SAATHI APP is now LIVE!
Scan for your digital safety today and access essential tools at your fingertips!#SancharSaathiMobileApp pic.twitter.com/TNKhRHUE4O— DoT India (@DoT_India) January 17, 2025
సంచార్ సాథీ ఉపయోగాలు
➤అనుమానిత కాల్స్ లేదా మెసేజస్ వచ్చినప్పుడు యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయచ్చు.
➤మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన నెంబర్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అనవసరమైన వాటిని బ్లాక్ చేసుకోవచ్చు.
➤మొబైల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది.
ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?
▸సంచార్ సాథీ అధికారిక వెబ్‌సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.
▸వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్‌లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.
▸మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.
▸అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
▸దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
▸క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
▸ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్‌ప్లే మీద కనిపిస్తాయి.
▸అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు.. ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు