
దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం జియో అగ్రస్థానంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుండగా.. మిగిలినవి తరువాత స్థానాల్లో ఉన్నాయి. తమ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ వేగంగా ఉంది?, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు కొంతమందికి తెలిసి ఉండదు. ఈ కథనంలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
సరైన మొబైల్ నెట్‌వర్క్ లేకపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక కొత్త సిమ్ కార్డును తీసుకోవడానికి ముందే.. మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ వేగంగా ఉందనే విషయం తెలుసుకోవాలి. దీనికోసం మీరు nPerf వెబ్‌సైట్ లేదా Opensignal యాప్ ఉపయోగించుకోవచ్చు.
nPerfలో ఎలా తెలుసుకోవాలంటే..
ఎన్పీఈఆర్ఎఫ్ అనేది 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్‌లను గుర్తించడానికి సహాయపడే వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఉత్తమంగా ఉందో ఉచితంగానే తెలుసుకోవచ్చు.
➤ముందుగా ఎన్పీఈఆర్ఎఫ్.కామ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
➤వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు పైభాగంలో కనిపించే మై అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి.. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.
➤ఆ తరువాత వెబ్‌సైట్‌లో కనిపించే మ్యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
➤ఆ తరువాత దేశం, మొబైల్ నెట్‌వర్క్ సెలక్ట్ చేసుకుని.. నగరం ఎంచుకోవాలి.
➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఉన్న సిగ్నెల్స్ చూడవచ్చు. ఏ సిగ్నెల్ నెట్‌వర్క్ ఎక్కువగా ఉందో.. గమనించి సిమ్ కార్డు తీసుకుంటే.. ఎప్పుడు నెట్‌వర్క్ సమస్య ఉండదు.
ఇదీ చదవండి: మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్‌మాన్
ఓపెన్ సిగ్నల్ యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా?
ఓపెన్ సిగ్నల్ యాప్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి యూజర్లు ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్ (Opensignal) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
➤యాప్ ఓపెన్ చేసిన తరువాత.. మీకు ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మూడో ఆప్షన్ మ్యాప్ మీద క్లిక్ చేయాలి.
➤మ్యాప్ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. అక్కడే లొకేషన్, ఆపరేటర్, నెట్‌వర్క్ వంటి వాటిని సెలక్ట్ చేసుకోవాలి.
➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఎంత ఉందనే విషయం తెలుస్తుంది. దాన్నిబట్టి మీరు ఏ సిమ్ కార్డు తీసుకోవాలనేది తెలుసుకోవచ్చు.