
పాన్ కార్డులకు (PAN Card) సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త డెడ్‌లైన్‌ను ప్రకటించింది. ఆధార్ ఎల్‌రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డులు పొందినవారందరూ వచ్చే డిసెంబర్ 31 లోగా దానిని తమ ఒరిజినల్ ఆధార్ నంబర్‌తో భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.
సీబీడీటీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 లేదా అంతకుముందు తమ ఆధార్ దరఖాస్తు నమోదు ఐడీని ఇచ్చి పాన్ కార్డులు వారందరూ తమ ఆధార్ నంబర్‌ను 2025 డిసెంబర్ 31 లోగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 3న విడుదలైంది. అయితే సదరు పాన్‌కార్డుదారులు తమ ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు ఎలా తెలియజేయాలన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.
ఆధార్-పాన్ లింకింగ్ లాగేనా?
నిర్దిష్ట పాన్ హోల్డర్లు ఆధార్ సంఖ్యను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడానికి పాన్-ఆధార్ లింకింగ్ పద్ధతిని ఉపయోగించవచ్చంటున్నారు ట్యాక్స్‌మన్.కామ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా. పాన్ హోల్డర్లు ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించి పాన్-ఆధార్ లింకింగ్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశిత పాన్ హోల్డర్లు పాన్-ఆధార్ లింక్ చేస్తే ఎలాంటి పెనాల్టీ వర్తించదని భావిస్తున్నారు. అయితే, దీని గురించి ఆదాయపు పన్ను శాఖ నుంచి మరింత స్పష్టత వస్తే ఇలాంటి పాన్ హోల్డర్లకు ఉపయోగపడుతుందన్నారు.
మరో ప్రత్యామ్నాయ మార్గంలో పన్ను చెల్లింపుదారులు ఎన్ఎస్‌డీఎల్ ఈగవ్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ నిర్దేశిత పాన్ సేవా కేంద్రాన్ని సందర్శించి పాన్ కార్డు, ఆధార్ కార్డు, నిర్దేశిత రుసుము కాపీతో పాటు నిర్దేశిత ఫారాన్ని నింపవచ్చని ట్యాక్స్ కన్సల్టింగ్ సంస్థ భూటా షా అండ్ కో ఎల్ఎల్‌పీ పార్టనర్ స్నేహ పాధియార్ చెబుతున్నారు. సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా కూడా ఆధార్‌ను ధృవీకరించవచ్చని, పాన్, ఆధార్ డేటాలో పొంతన లేకపోతే బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి అని తెలియజేశారు.
ప్రస్తుతం, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాన్-ఆధార్ లింక్ కోసం సాధారణ పాన్ హోల్డర్లకు గడువు 2023 జూన్ 30తో ముగిసింది. అందువల్ల పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని ఏ పాన్ హోల్డర్ అయినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేవలం ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డు పొందినవారు ఆ సమయంలో ఒరిజినల్ ఆధార్ నంబర్ లేదు కాబట్టి గడువులోగా రెండింటినీ లింక్ చేయలేరు. కాబట్టి, ఈ పాన్ హోల్డర్లకు ఇప్పుడు ఈ పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం నుండి మినహాయింపు ఇవ్వాలి.
డిసెంబర్ 31 తర్వాత ఏమి జరుగుతుంది?
పాన్ హోల్డర్లు తమ ఆధార్ నంబర్‌ను 2025 డిసెంబర్ 31 లోగా లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మరేదైనా తేదీలోగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే, పాన్ హోల్డర్లు తమ ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు అందించడంలో విఫలమైతే ఏమి జరుగుతుందో మాత్రం పేర్కొనలేదు. గడువు తేదీలోగా ఆదాయపు పన్ను శాఖకు ఆధార్ నంబర్ తెలియజేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ పనిచేయకపోవచ్చు. అయితే ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి మరింత స్పష్టత వస్తే బాగుంటుందని వాధ్వా పేర్కొన్నారు.