
అనవసరంగా ఖర్చు చేయడం, తర్వాత అప్పులు చేయడం వంటి తప్పిదాలు చేయకూడదని జెరోధా సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో డబ్బు సంపాదించాలంటే ఎలాంటి షార్ట్‌కట్లు లేవని, స్థిరమైన అలవాట్లు, సహనం ద్వారానే నిజమైన సంపద సృష్టించవచ్చని అన్నారు. తనను తరచుగా స్టాక్స్ చిట్కా కోసం చాలా మంది అడుగుతుంటారని ఎక్స్ ఖాతాలో తెలుపుతూ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో సీక్రెట్ రివీల్ చేశారు.
‘ధనవంతులు కావడానికి షార్ట్ కట్‌లు లేవు. దీనికి మంచి అలవాట్లు, సహనం అవసరం. మీకు అవసరం లేని వస్తువులను కొనడం లేదా వాటిని కొనడానికి అప్పు చేయడం వంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య బీమా లేకపోవడం కూడా చాలా మందిని పేదరికంలోకి నెట్టివేస్తుంది’ అన్నారు. ఎక్కువ సంపాదించడం అంటే ఎక్కువ పొదుపు చేయడం మాత్రమే కాదనే సందేశంతో కూడిన వీడియోను కామత్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో ఈజీగా హైసెక్యూరిటీ ప్లేట్లు

‘వాస్తవానికి చాలామంది తరచుగా గాడ్జెట్లు, దుస్తులు, ఫ్యాన్సీ భోజనం..వంటి వాటికోసం అధికంగా ఖర్చు చేస్తుంటారు. ఇందులో ఎక్కువ భాగం ఈఎంఐ (సులభమైన నెలవారీ వాయిదాలు)లపైనే కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇంకా సంపాదించని డబ్బు ఇప్పటికే ఖర్చు చేసి ఉంటారు. జీతం రాకముందే దేనికి వెచ్చించాలో కమిట్ అయిపోతారు. దాంతో పేదరికంలోకి వెళుతున్నారు. మీ సంపాదనలో నెలకు రూ.50,000 ఖర్చు చేస్తారని భావిస్తే కేవలం 1% అంటే రూ.500 నుంచి ఆదా చేసేందుకు ప్రయత్నించండి. కేవలం ఒక ఆన్‌లైన్ ఆర్డర్‌ను దాటవేయడం వల్ల దీన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 10-12% సీఏజీఆర్ రాబడి ఉన్న ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు భావిస్తే కాలక్రమేణా ఆ చిన్న పొదుపు అధిక రాబడిని అందిస్తుంది’ అన్నారు.