
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో మూడింట ఒక వంతు రుణ ఆధారితమేనని ‘ఫి కామర్స్’ సంస్థ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 20,000 మర్చంట్ లావాదేవీలను అధ్యయనం చేసి ఈ వివరాలు విడుదల చేసింది. ప్రతి మూడు డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో క్రెడిట్‌కార్డు, వడ్డీతో కూడిన ఈఎంఐలు ఒకటి ఉండడం గమనార్హం. మొత్తం లావాదేవీల్లో యూపీఐతో చేసినవి 65 శాతంగా ఉన్నట్టు ఫి కామర్స్ తెలిపింది.
స్వల్ప, మధ్య స్థాయి చెల్లింపులను ఎక్కువగా యూపీఐ సాయంతో చేస్తుంటే, పెద్ద లావాదేవీలు క్రెడిట్ కార్డులు, ఈఎంఐల రూపంలో ఉంటున్నాయి. ఫీజుల చెల్లింపులు, వైద్య పరమైన చెల్లింపులకు క్రెడిట్‌కార్డులను ఉపయోగిస్తున్నారు. పండుగల సందర్భంగా కొనుగోళ్లు, స్కూళ్లలో ప్రవేశాలు, సీజన్ వారీ అవసరాలకు రుణాలనే నమ్ముకుంటున్నారు.
అంటే స్వల్పకాల రుణాలకు వినియోగదారులు క్రెడిట్ కార్డులు, రుణ ఈఎంఐలపై ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యా సంబంధిత చెల్లింపులకు 10 శాతం, హెల్త్‌కేర్ చెల్లింపులకు 15 శాతం, ఆటో విడిభాగాల కొనుగోళ్లకు 15 శాతం మేర రుణ సాధనాల ఆధారితంగానే చెల్లిస్తున్నారు. ఒకేసారి చెల్లింపుల కంటే రుణ ఆధారిత చెల్లింపులకు ఆసక్తి చూపిస్తున్నట్టు.. వినియోగదారుల ధోరణిలో మార్పునకు ఈ ఫలితాలు నిదర్శమని ఈ నివేదిక పేర్కొంది.