
చికిత్స పొందుతున్న రత్నమయ్య
తాడిపత్రి రూరల్(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వర్గీయులపై వరుస దాడులకు తెగబడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు ఘటనలు చోటు చేసుకోవడం తాడిపత్రి ప్రజల్లో భయాందో ళనలు సృష్టిస్తోంది. తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ వర్గీయుడు రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రత్నమయ్యపై గురువారం వేటకొడవలితో దాడి చేశాడు.
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి గెలుపునకు రత్నమయ్య తనవంతు కృషి చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని రామాంజనేయులు, మరికొందరు గ్రామంలోని బస్టాప్ సమీపంలో రచ్చకట్ట వద్దనున్న రత్నమయ్యపై వేట కొడవలితో దాడి చేశారు. ఘటనలో రత్నమయ్య ఎడమ చేయి తెగడంతో పాటు తొడకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తీసుకెళ్లారు. ఘటన సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. రామాంజనేయులుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.