
World Autism Awareness Day
అమెరికాలో మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య సంబంధంపై విస్తృత చర్చ జరుగుతోంది. సీడీసీ(CDC), WHO చేసిన విస్తృతమైన అధ్యయనాలతో సహా పరిశోధనలు వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించాయి. ఆటిజం ప్రధానంగా జన్యు, పర్యావరణ కారణాలుగా వస్తోందని భావిస్తున్నారు. టీకాలు నిజంగా ఆటిజానికి కారణం కానపుడు, సైన్స్ ప్రకారం దానికి కారణమేమిటి? World Autism Awareness Day డే సందర్బంగా అటిజానికి నివారణ, చికిత్స తదితర వివరాలు తెలుసుకుందాం.
టీకాల కారణంగా ఆటిజం వస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. టీకాలకూ, ఆటిజంకు సంబంధం లేదు. పిల్లలందరికీ ఏ వయసులో ఇప్పించాల్సిన టీకాలు యథావిధిగా ఆవయసులో ఇప్పించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రవర్తనకు అనుగుణంగా మందులు ఇవ్వడమే...
ఆటిజంకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్లు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీళ్లలో ఫిట్స్ (మూర్ఛ) వంటి అనుబంధ సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు వాటికి సంబంధించి మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. - డా. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్
బుద్ధిమాంద్యం అనే అపోహ ఉంది
ఆటిజం అంటే అది ఒక రకమైన బుద్ధిమాంద్యత అని కొందరు అపోహ పడుతుంటారు. చాలా కేసుల్లో మిగతా అందరు పిల్లల్లా అందరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోవడమే వీరిలో ఉండే లోపం. నిజానికి చాలామంది నార్మల్ చిన్నారుల కంటే చాలా ఎక్కువ ఐక్యూను ప్రదర్శించేవారూ ఈ పిల్లల్లో ఉంటారు. మెదడు వికాసం లేకపోవడం అన్నది.. సమçస్య తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు మూడోవంతు పిల్లల్లో మాత్రమే ఉంటుంది. వీరి విషయంలో ఏ అంశంలో వికాసం కొద్దిగా ఆలస్యం జరుగుతోందో ఆ అంశంలో శిక్షణ ఇస్తే వాళ్లు నార్మల్ పిల్లల్లానే పెరగగలుగుతారు. -డా.ప్రభ్‌జ్యోత్ కౌర్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్
ఎంత త్వరగా సమస్య గుర్తిస్తే అంత మంచిది
ఆటిజం ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పలేం. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశోధకులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. అయితే ఆటిజం పిల్లలను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉంది. పట్టణాల్లో తమ పిల్లలకు ఆటిజం సమస్య ఉందని తెలిస్తే పరువు పోతుందేమో అనుకునేవారూ ఉన్నారు.
పిల్లలు చూడటానికి బాగానే ఉన్నారు కదా, మనస్తత్వంలో మార్పు అందే వస్తుందిలే అని సరిపెట్టుకునేవారూ ఉన్నారు. కానీ, ఆటిజం సమస్య ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. వారికి అర్ధమయ్యే విధంగా ఒక్కో అంశాన్ని పరిచయం చేయాలి. అందుకు చాలా ఓర్పు, శిక్షణ ఇచ్చే టీచర్లు అవసరం. ప్లే స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ల నుంచే అవగాహన తరగతులు నిర్వహించాలి. టీచర్లు, తల్లిదండ్రులూ ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తించి, శిక్షణ ఇస్తే అంత మంచిది. -పి. హారికారెడ్డిబిహేవియర్‌అనలిస్ట్, యాధా ఏబీఏ సెంటర్,అత్తాపూర్,హైదరాబాద్
ఓపికగా నేర్పాలి
ఆటిజం అనేది న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. దీని బాధిత పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్య ఉంటుంది. సమస్య ఉన్న పిల్లల్లో స్టీరియోటైపిక్ బిహేవియర్ (ఒకే పనిని పదేపదే చేయడం) ఉంటుంది. ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం, వేరుగా చూడడం చేయకూడదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ప్రవర్తించాలో ఓపికగా నేర్పాలి. -డాక్టర్ వై.ప్రదీప్‌చిన్న పిల్లల వైద్యులు, డైక్ సెంటర్ తిరుపతి
3 స్థాయిల్లో ఆటిజమ్
పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత ఆధారంగా దీనిని ప్రధానంగా మూడు స్థాయిలుగా విభజించారు.
మైల్డ్ ఆటిజం: పిల్లల వికాసంతక్కువగా (30% వరకు) ప్రభావితం అవుతుంది.
మాడరేట్ ఆటిజం : వీరిలో వికాసం 30% నుంచి 60% లోపు ప్రభావితమవుతుంది.
సివియర్ ఆటిజం: వికాసం చాలాఎక్కువగా ప్రభావితమవుతుంది.అంటే 60 శాతానికి పైగా.
నేర్చుకోవడానికి సంబంధించి కొన్ని సమస్యలు
» ఈ చిన్నారుల్లో నేర్చుకోవడానికి సంబంధించిరకరకాల సమస్యలు కనిపించవచ్చు. వాటిల్లో కొన్ని..
» జ్ఞానేంద్రియాల నుంచి లభ్యమయ్యే సమాచారాన్ని సరిగావిశ్లేషిoచుకోలేకపోవడం (సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ – ఎస్‌పీడీ).
» నేర్చుకునే ప్రక్రియ సరిగా జరగకపోవడం (లెర్నింగ్ డిజార్డర్–ఎల్‌డీ).
» కొంతమంది చిన్నారుల్లో ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలు(బిహేవియరల్ డిజార్డర్స్) ఉంటాయి. అంటే నలుగురితో కలవలేరు. అకారణంగా ఏడుస్తూ ఉంటారు.
» కొందరిలో ఆటిజంతో పాటు మూర్ఛ వంటి నాడీ సంబంధిత రుగ్మతలుండవచ్చు.
ఎందుకుఇలాంటి సమస్యలు?
ఆటిజంకు కారణాలుతెలుసుకోడానికి ఇప్పటికీపెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టమైన కారణాలేమీ ఇంకా తెలియరాలేదు. అయితే కొన్ని అధ్యయనాల్లో ఆటిజంకు గురికావడానికి కారణాలను కొంతవరకు తెలుసుకున్నారు. అవి...
» కొంతమేరకు జన్యుపరమైన కారణాల వల్ల దీని బారిన పడుతున్నారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, మెదడులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు సంబంధిత అంశాల్లో లోపాల వల్ల..
» బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి జెస్టేషనల్ డయాబెటిస్‌కు, హార్మోన్ల అసమతుల్యతకు లోను కావడం, గర్భధారణకు ముందు ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం వల్ల..
» గర్భంతో ఉన్నప్పుడు వాడిన, వాడకూడని కొన్ని మందుల వల్ల..
ఆ అధ్యయనాల్లో
దేశంలో ఆటిజంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సులోపు చిన్నారుల్లో 1 నుంచి 1.5 శాతం పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని ఐఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు అందుబాటులో లేవు.
అయితే తెలంగాణలో 0–9 ఏళ్ల వయస్సు చిన్నారులు 60 లక్షల వరకు ఉంటారని అర్ధ గణాంక శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇందులో ఒక శాతాన్ని లెక్కిస్తే 60 వేల మంది, 1.5 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 90 వేల మంది వరకు చిన్నారులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సాధారణంగా ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆటిజంలోని రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఏం చేయాలి మరి.. ?
దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి. పిల్లల్లో సమస్యను గుర్తించిన వెంటనే చికిత్సకు తీసుకెళ్లాలి. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత త్వరగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 2 ఏళ్ల వయస్సు లోపు గనుక గమనిస్తే సులభంగా బయటపడే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆటిజం లక్షణాలు కనబరచే పిల్లలకు.. కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలూ సమాధానాల ఫార్మాట్‌లో నిర్వహించే పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారించవచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఫిట్స్ వంటి న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడే ఎమ్మారై, ఈఈజీ, మెటబాలిక్ డిజార్డర్ స్క్రీనింగ్ వంటివి అవసరం.
ఎలాంటి మందులూ లేవు..
ఈ రుగ్మతకు ఎలాంటి మందులూ లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫిట్స్ లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది.
రకరకాల థెరపీలతోనే చికిత్స
చిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్‌ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి.
ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్‌కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్స్...
ఆటిజంకు థెరపీ పేరిట నగరాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్లు, చైల్డ్ రిహాబిలేటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటి నిర్వాహకులు అర్హత కలిగిన థెరపిస్ట్‌లు కాకపోయినా..కేవలం ఆయాలను నియమించుకుని ఇలాంటి సెంటర్లు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎన్‌జీవో సంస్థలు నిబద్ధతతో పనిచేస్తుంటే.. కొందరు పూర్తిస్థాయి వ్యాపారంలా నిర్వహిస్తున్నారు. ఒక్కో పిల్లాడిపై నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, నిర్వహణ, నియంత్రణ లేకపోవడం వల్ల స్పీచ్ థెరపీ కేంద్రాలు ఇష్టానుసారం వెలుస్తున్నాయి. ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే ఆసుపత్రి భవనం, అందులో అర్హతగల డాక్టర్లు, నర్సులు, ఆయాలు, పడకలు తదితర సౌకర్యాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. కానీ ఈ పునరావాస కేంద్రాలకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు..
» ఆటిజం ఒక వైకల్యంగా గుర్తింపు..
» పునరావాస కేంద్రాలు నడిపించే ఎన్జీవోలకు ఆర్థిక సాయం
» వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన హక్కుల చట్టాన్ని వీరికి కూడా వర్తింపచేయడం ద్వారా విద్యలో, పునరావాసంలో సహాయం
» ఆటిజం బాధితులకు ఉన్నత విద్య అభ్యాసానికి ఆర్థికసాయం
» వీరికి యూనిక్ డిజెబిలిటీ (విశిష్ట వైకల్యం) గుర్తింపు కార్డు ఇవ్వడం
» రూ 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం
» ఆటిజం తగ్గింపునకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆర్థిక సాయం.
» పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు మంజూరు, నైపుణ్య శిక్షణ.
» ప్రాంతాల వారీగా సంగీత, నృత్య కచేరీలు ఏర్పాటు
» రాష్ట్రంలో ఇప్పటివరకు ఆటిజంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు లాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం.