
చెన్నైలో డీలిమిటేషన్‌పై జరిగిన సమావేశం
అభిప్రాయం
జనసంఖ్య ప్రాతిపదికగా నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరుగుతుందనే ప్రకటనపై పార్లమెంట్‌లోనూ, బయటా దక్షిణాది రాష్ట్రాల వారు ప్రకంపనలు పుట్టిస్తున్నారు. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు లభించే అవకాశం ఉండడంతో పార్లమెంట్‌లో తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుంది. అదే సమయంలో జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇందువల్ల అధికారం, పరిపాలన, అభివృద్ధి వంటి అంశాల్లో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందనీ, ఫలితంగా దక్షిణాదిలో అస్తిత్వ సంక్షోభం రాజుకుంటుందనేది నిపుణుల మాట.
కుటుంబ నియంత్రణ నిక్కచ్చిగా పాటించడం వలన దక్షిణ భారత జనాభా ఉత్తర భారత జనాభా కంటే బాగా తగ్గిన సంగతి తెలిసిందే. నిజానికి దక్షిణ భారతం (South India) ప్రకృతి వనరులూ, మానవ వనరుల పరంగా ఉత్తరాదికన్నా శక్తిమంతంగా ఉంది. దీని అంతటికీ కారణం శతాబ్దాలుగా బౌద్ధ జీవన సాంస్కృతిక వికాసమేనని చెప్పక తప్పదు. ఉత్తర భారతంతో పోల్చినప్పుడు, దక్షిణ భారతం అహింసాత్మకంగా ఉంది. శాంతియుతంగా వుంది. విద్యాపరంగా బలంగా ఉంది. అక్షరాస్యతలో ముందు ఉంది. స్త్రీ విద్యలో ముందు ఉంది. చరిత్ర, సంస్కృతులను పరిశీలించినా దక్షిణాదికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రక్తపాత రహిత కుల నిర్మూలన ఉద్యమం కొనసాగుతోందిక్కడ. అతి ప్రాచీన భాషలు మాట్లాడే ఆదివాసీలు ఎందరో ఇక్కడ ఉన్నారు. శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, చోళులు, విజయనగరరాజులు... ఇలా ఎందరో రాజులు, చక్రవర్తులు ఈ నేల సుభిక్షం కావడానికి తమ యుద్ధనైపుణ్యాన్నీ, పాలనా చాతుర్యాన్నీ ప్రదర్శించారు.
ఈ రోజు ఢిల్లీ వాయు కాలుష్యంతో ఆక్సిజన్ లేక జీవన సంక్షోభంలో వుంది. దానికి ప్రత్యామ్నాయ రాజధాని వంటి హైదరాబాద్ దక్షిణాది నగరమే కదా. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ (BR Ambedkar) ఆనాడే హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసుకోమని చెప్పారు. హైదరాబాద్ ఇటు దక్షిణాది వారికి, అటు ఉత్తరాది వారికి, పశ్చిమ భారతానికీ సెంటర్‌గా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. విద్య, సాంకేతిక రంగాల్లో దక్షిణ భారతదేశం ఇప్పటికే ముందు ఉంది. ఐటీ, సాఫ్ట్‌వేర్, సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతుల్లో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థల్లో మన తెలుగువారితోపాటు మిగతా దాక్షిణాత్యులే ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్న సంగతీ తెలిసిందే. అరకొరగా ఉన్న వనరుల నుంచే ఈ స్థాయికి చేరారు మనవారు.
ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచే ప్రతిపాదన ముందుకు వచ్చింది. వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతికి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు ‘మార్గదర్శకాలు–2025’ పేరిట విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల ఒక ముసాయిదాను విడుదల చేసింది. అందులోని అంశాలు బాగా వివాదాస్పదమవు తున్నాయి. ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల అధిపతులైన ఉప కులపతుల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది.
నూతన ముసాయిదా ప్రకారం ఆ అధికారం ఛాన్స్‌లర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మార్పును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమిళనాడు (Tamil Nadu), కేరళ వంటివి నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్ట సభల్లో తీర్మానం కూడా చేశాయి. వైస్ ఛాన్స్‌లర్ల నియామక ప్రక్రియను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడాన్ని అవి వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర చర్యలతో ఉన్నత విద్యపై తమ పట్టును పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర– రాష్ట్ర సంబంధాలు బలహీనమవ్వడం గమనార్హం.
చదవండి: ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?
ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ అంశం ముందుకు రావడంతో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) నిరసన గళాన్ని వినిపించడంలో ముందున్నారు. ఆయన చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి దక్షిణ భారతానికి చెందిన బీజేపీయేతర పార్టీలు చాలావరకూ హాజరయ్యాయి. ఈ విషయంలో అన్నీ ఒకే విధమైన నిరసనను వ్యక్తం చేయడం స్వాగతించవలసిన విషయం. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి ఎటువంటి నష్టం రాదని కేంద్ర పాలకులు అంటున్నా... అది ఎలాగో ఇంతవరకూ వివరించలేదు. కేంద్రం సముచితంగా వ్యవహరించకపోతే దేశంలో అశాంతి రేగే ప్రమాదాన్ని చెన్నై (Chennai) సమావేశ ధోరణి చూస్తే అర్థమవుతుంది.
- డాక్టర్ కత్తి పద్మారావు
దళితోద్యమ నాయకులు