నెగ్గేదెలా? | Sakshi Guest Column On Delimitation | Sakshi

నెగ్గేదెలా?

Mar 17 2025 5:22 AM | Updated on Mar 17 2025 5:22 AM

Sakshi Guest Column On Delimitation

అభిప్రాయం

లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాల దామాషా ప్రాతినిధ్యానికి ముప్పు వాటిల్లబోతోంది. వాటి మెడపై డీలిమిటేషన్‌ కత్తి వేలాడుతోంది. ఈ ఉపద్రవం తప్పాలంటే కేంద్రం మెడ వంచాలి. దీనికోసం దక్షిణాది తరఫున తమిళనాడు ముందుండి కేంద్రంపై పోరాటం చేస్తోంది. భారత సమాఖ్య పట్ల ఏకీభావం ప్రతిష్టంభనలో పడింది. 

ఈ నేపథ్యంలో, డీలిమిటేషన్‌ మరో 30 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిల పక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ , ‘వన్‌ నేషనిజం’ అంటూ బీజేపీ సమస్యను జటిలం చేస్తోంది. భాషావివాదం మీద పార్లమెంటులో మాట్లాడుతూ, తమిళనాడుకు నిజాయితీ లేదని, అనాగరిక రాష్ట్రమని నిందిస్తూ ఆ రాష్ట్రానికి విద్యానిధులు తొక్కిపట్టింది. 

సమాఖ్య విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొరవడింది. కాబట్టే బీజేపీ కూటమి యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు నేతృత్వంలో  కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. డీలిమిటేషన్‌ చిక్కుముడికి పరిష్కారాలు లేకపోలేదు. రాజ్యసభ స్వరూపం మార్చడం వీటిలో ఒకటి. రాష్ట్రాల సరైన ప్రాతినిధ్యానికి వేదికగా దాన్ని రూపొందించాలి. అలాగే సంఖ్యాపరంగా లోక్‌సభ సైజు పెంచడం ద్వారా, పెద్ద రాష్ట్రాలు అదనపు స్థానాలు పొందినా, ఇతరత్రా ఏ రాష్ట్రం నష్టపోకుండా చూడవచ్చు. 

అధిక జనాభా ఉన్న యూపీ, బిహార్‌ వంటి రాష్ట్రాల సరిహద్దులు మార్చడం మరో మార్గం. ఆర్థిక వృద్ధి అనివార్యతలు, రాష్ట్రాల నడుమ నెలకొన్న సామాజిక ఆర్థిక అంతరాలు సమాఖ్య స్ఫూర్తి పునాదులను బలహీన పరుస్తున్నాయి. రాష్ట్రాల పునర్‌ విభజన చట్టంతో భాషా సమస్య పరిష్కారమైన పిదప, సమాఖ్య ఏకీభావతకు ఎదురవుతున్న తొలి సవాలు ఇదే. దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు కావల్సింది సమాఖ్య సూత్రానికి అన్ని వైపుల నుంచీ బలమైన మద్దతు.

విశ్వాసం కల్పించాల్సింది కేంద్రమే!
చరిత్ర చూసినట్లయితే, పాలనలోనూ, నిధుల పరంగానూ కేంద్రీకృత విధానాలే ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సైతం ప్రాంతీయ పార్టీలు పాత వ్యవస్థను సవాలు చేయలేదు. దీంతో సమాఖ్య సూత్రం గట్టిగా వేళ్ళూన లేదు. ద్రవ్యపరంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గలేదు. పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు పంచాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రాల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 

అయితే ఇది రాజకీయ పటా టోపంగానే మిగిలి పోయింది. ఆ రోజుల్లో యథా తథ స్థితిని అనుసరించడమే రాజకీయ సంస్కృతిగాఉండేది. పేద రాష్ట్రాలకు జాతీయ పన్నుల్లో అధిక వాటా లభించడం తరహా సమన్యాయ సూత్రానికి రాష్ట్రాలన్నీ ఇష్టపూర్వకంగానే తలలూ పాయి. ప్రాతినిధ్య అసమానతను అంగీకరించాయి.

సమాఖ్య ఏకాభిప్రాయం మీద ఆర్థిక వృద్ధి ప్రభావం పడుతోంది. పన్నుల హేతుబద్ధీకరణ, నియంత్రిత మార్కెట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించే సేవలు వంటి అవసరాలకు కేంద్రీకృత వ్యవస్థ ఎన్నో రకాలుగా ఉపయుక్తం అవుతుంది. ఇలా జరగడం వల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కూడా అంతే స్థాయిలో తగ్గుతుంది. నిధుల పంపిణీ పరంగా కొత్త వివాదాలు ఉత్పన్నమవుతాయి.

ఈ వివాదాలను విశ్వసనీయంగా పరిష్కరించే శక్తి కేంద్రానికి మునుపటి కంటే ఎక్కువ అవసరమవుతుంది.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం లోకి మారడం వల్ల ఉత్పన్నమైన వివాదాలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రాలు తమ పన్ను విధింపు హక్కును వదులుకోవడంతో, పన్ను ఆదాయంలో తమ వాటా ఎంత అన్నది ప్రధానంగా మారింది. రాష్ట్రాల నడుమ ఆర్థిక అంతరం హెచ్చింది. 

ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలు సమన్యాయాన్ని సవాలు చేయసాగాయి. 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తిన అంశం ప్రస్తావనార్హం: ‘కర్ణాటక సమకూర్చే ప్రతి రూపాయిలో ప్రస్తుత  ఫార్ములా ప్రకారం తిరిగి వెనక్కు వచ్చేది కేవలం 15 పైసలు’ అని ఆయన వాపోయారు. తమిళ నాడు కూడా ఇదే వాదన చేసింది. డీలిమిటేషన్‌ మీద ఆందోళనలు సైతం అదే మాదిరివి.

భిన్న ప్రాంతాల నడుమ ఆర్థిక అసమానతలు పెరిగిపోవడమే లక్షణంగా మారిన ఈ దేశంలో ఈ సమదృష్టి సూత్రం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కానప్పుడు, పన్ను ఆదాయాల పంపిణీ ఫార్ములాను సంతులన పరచుకుంటూ అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకూ కలిపి ఒక ప్రత్యేక ఫండ్‌  ఏర్పాటు చేయడం వంటి వేరే మార్గాలు కేంద్రానికి లేవా? అలాగే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామన్న విశ్వస నీయ సంకేతం ఇవ్వాల్సిన, కొత్త ఏకాభిప్రాయాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది.   

సమాఖ్య విధానం పట్ల బీజేపీ ఒంటబట్టించుకున్న అసహనం సమస్య పరిష్కారాన్ని జటిలం చేస్తోంది. స్వయంప్రతిపత్తి గల జమ్ము – కశ్మీర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు గుంజుకుని, వాటిని కేంద్రం పెత్తనం కిందకు తెచ్చుకోవడం వల్ల ఏర్పడిన పరిణామాలు, రాష్ట్రాలకు పన్నుల్లో దక్కాల్సిన వాటాను తనకు మాత్రమే దఖలు పడే సెస్సులు, సర్‌ చార్జీల విధింపు ద్వారా కుదించివేయడం, అలాగే కేంద్రం సేవలో ఉండేలా కొత్త పాలనా సంస్కృతిని ప్రోత్సహించడం... ఇవన్నీ సమాఖ్య పట్ల కేంద్ర అసహనానికి నిదర్శనాలు.  

ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్రంపై రాజకీయంగా ధ్వజమెత్తడం, రాజీలేని వైఖరి ప్రదర్శించడం మినహా మరేం చేయగలవు? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ హక్కుల కోసం బేరసారాలు జరిపే హక్కు ఎన్ని పరిమితులకు లోబడి ఉందో ప్రస్తుత డీలిమిటేషన్‌ చిక్కుముడి వెల్లడిస్తోంది. డీలిమిటేషన్‌ను ఎంతకాలం వీలైతే అంతకాలం వాయిదా పడేలా చేయాలన్న స్టాలిన్‌ ఆలోచన ఫలితమే ప్రస్తుత ప్రతిష్టంభన! ఎంతో కష్టపడి సాధించుకున్న అమూల్యమైన భారత సమాఖ్య ఈ క్రమంలోమరింత బలహీన పడుతుంది.

యామినీ అయ్యర్‌ 
వ్యాసకర్త బ్రౌన్‌ యూనివర్సిటీలో విజిటింగ్‌ సీనియర్‌ ఫెలో
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement