
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు.
తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్‌ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది.
తమిళ సెంటిమెంట్ ఆందోళన
హిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది?
రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది.
బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే.
హిందీని నిర్దేశించకపోయినా...
హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా.
మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్‌ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.
సరికొత్త ప్రచారకర్త
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు.
ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.
చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.
దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది.
ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది.
డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్‌ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.
-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
-నిరుపమా సుబ్రమణియన్