
జోహన్నెస్‌బర్గ్‌లో తనకు స్వాగతం పలికిన భారతీయులకు మోదీ అభివాదం
జోహన్నెస్‌బర్గ్: రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో సంస్కరణలను మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో వేగం పుంజుకుందని చెప్పారు. మంగళవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించడంలో 15వ బ్రిక్స్ సదస్సు సఫలమవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్‌గా పాల్గొననున్నారు.