యుద్ధం ఆగేనా? సుంకాలు మీకు ఓకేనా? | Netanyahu And Donald Trump Prepared Final War Plan For Gaza, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

యుద్ధం ఆగేనా? సుంకాలు మీకు ఓకేనా?

Published Sun, Apr 6 2025 3:13 PM | Last Updated on Sun, Apr 6 2025 4:50 PM

Netanyahu and Trump Prepared Final war Plan for Gaza

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(US President Donald Trump) వివిధ దేశాలపై సుంకాలను విధించిన తరుణంలో ఆయన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్‌ 7న జరగనున్న ఈ భేటీలో ఇరువురు నేతలు గాజా స్వాధీనం కోసం తుది యుద్ధ ప్రణాళికను సిద్ధం చేశారని తెలుస్తోంది. 

ఇజ్రాయెల్ త్వరలోనే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోబోతోందని, ఇందుకు ట్రంప్‌ మద్దతుగా నిలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే  అమెరికా సర్కారు కొత్తగా విధించిన సుంకాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్‌ చర్చించనున్నారని సమాచారం.

ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత వైట్ హౌస్‌లో నెతన్యాహు(Netanyahu)తో  ఇప్పుడు రెండోసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాన్ని వైట్ హౌస్ తో పాటు నెతన్యాహు కార్యాలయం ధృవీకరించాయి. హమాస్ తీవ్రవాదులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ గతకొంతకాలంగా గాజా స్ట్రిప్‌లోని నూతన భద్రతా కారిడార్‌లో సైన్యాన్ని మోహరిస్తున్న తరుణంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గత నెలలో ఇజ్రాయెల్(Israel) కాల్పుల విరమణను ఉల్లంఘించి, అకస్మాత్తుగా గాజాపై బాంబు దాడి చేసింది. ఈ చర్యకు వైట్ హౌస్ మద్దతు పలికింది. కాగా బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ సమావేశంలో సుంకాల సమస్య, ఇజ్రాయెల్-టర్కీ సంబంధాలు, ఇరాన్ నుండి పొంచివున్న ముప్పు తదితర అంశాలపై చర్చించనున్నట్లు నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ
గత వారం గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. 

ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్‌ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు.  ఈ క్రమంలో శుక్రవారం ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 16 మందికి పైగా పాలస్తీనా వాసులు చనిపోవడం గమనార్హం.  ఈ తరుణంలో అమెరికా-ఇజ్రాయిల్‌ దేశాధినేతలు భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇజ్రాయిల్‌ కు టారిఫ్‌ ఉపశమనం..
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు సంబంధించి ఇటీవల  ప్రపంచ దేశాలపై సుంకాల విధించి షాకిచ్చిన ట్రంప్‌.. ఇజ్రాయిల్‌ పై 17 శాతం సంకాన్ని విధించారు.  ట్రంప్‌ పలు దేశాలకు విధించిన సుంకాల పరంగా చూస్తే ఇజ్రాయిల్‌ కు కాస్త ఊరటనిచ్చినట్లే కనబడింది. భారత్‌ పై 26 శాతం సుంకాన్ని విధించిన ట్రంప్‌.. చాలా దేశాలపై 20 శాతం 49 శాతం వరకూ కూడా సుంకాలు విధించారు.  ఇక్కడ ఇజ్రాయిల్‌ కు మాత్రం 17 శాతాన్ని సుంకాన్ని మాత్రమే విధించడంతో ఆ దేశంపై కాస్త ప్రేమ చూపించినట్లే అవగతమవుతుంది.  సుంకాలకు సంబంధించి కూడా ఇజ్రాయిల్‌ తో డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చించే అవకాశం ఉంది. ఒకవేశ ఇజ్రాయిల్‌ ఏమైనా గట్టిగా పట్టుబడితే దానిని కాస్త కుదించే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: నవమి వేడుకల్లో కత్తులు తిప్పిన బీజేపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement