
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఖైదీల మార్పిడిలో భాగంగా బుధవారం రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్‌ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్‌ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్‌ను విడుదలచేసినట్లు తెలుస్తోంది.
విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017లో గ్రీస్‌లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికాకు అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్సే్ఛంజ్ బీటీసీ–ఈ ద్వారా రాన్సమ్‌వేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024 మేలో అంగీకరించాడు. అప్పటినుంచి జైలులో ఉన్నారు.
మొత్తం 11 మంది విడుదల
ఫోగెల్ విడుదల ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి తాము సరైన దిశలో వెళ్తున్నామనడానికి సంకేతమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్టŠజ్ అన్నారు. ఖైదీల మార్పిడి అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి సహాయపడిందని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇవి పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే తప్ప ఉక్రెయిన్ కోణంలో చేస్తున్న పనులు కావని ఆయన స్పష్టంచేశారు.
రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో అమెరికా పౌరుడిని కూడా విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షభవనం బుధవారం ప్రకటించింది. బెలారస్‌లో అన్యాయంగా నిర్బంధించబడిన ఒక అమెరికన్‌ను, ఇద్దరు రాజకీయ ఖైదీలు విడుదల అయ్యారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇతర దేశాల్లోని అమెరికా పౌరుల విడుదలకు కృషిచేస్తున్నామని రూబియో చెప్పారు. ఇవి ట్రంప్ మధ్యవర్తిత్వ సామర్థ్యానికి నిదర్శనమని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. గత నెలాఖరులో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశ కారాగారాల నుంచి ఇప్పటిదాకా 11 మంది అమెరికన్లు విడుదలయ్యారు.