
రహస్య పరికరాలను గుర్తించిన యూకే అధికారులు
లండన్: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) అణు జలాంతర్గాములపై రష్యా ప్రత్యేకంగా నిఘా పెట్టిందా? సముద్రంలో వాటి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రహస్యంగా సెన్సార్లు ఏర్పాటు చేసిందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. యూకే చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాల్లో కొన్ని సెన్సార్ పరికరాలను బ్రిటిష్ రాయల్ నేవీ గుర్తించినట్లు సమాచారం. రష్యా తమ అణు జలాంతర్గాములపై నిఘా పెట్టినట్లు యూకే ఆరోపిస్తోంది.
తమకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నట్లు రష్యాపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తమ ఆయుధ సంపత్తిని దెబ్బతీయాలన్నదే రష్యా ప్రయత్నంగా కనిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తంచేస్తోంది. ఈ పరిణామాన్ని దేశ భద్రతకు ముప్పుగా సైనికాధికారులు అభివరి్ణంచారు. అట్లాంటిక్ మహా సముద్రంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, రష్యా కార్యకలాపాలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
రష్యా అధినేత పుతిన్ చేపట్టిన గ్రేజోన్ యుద్ధ వ్యూహంలోనే భాగంగానే తమ అణు జలాంతర్గాములను రష్యా టార్గెట్ చేసుకున్నట్లుగా యూకే అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర గర్భంలోని రహస్య కేబుల్స్‌తోపాటు పైప్‌లైన్లు, కీలక పరికరాలను ధ్వంసం చేయడం ద్వారా పరోక్ష యుద్ధం సాగించడమే గ్రేజోన్ వ్యూహం. ఇది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని చెబుతున్నారు.
గత 15 నెలల వ్యవధిలో బాల్టిక్ సముద్రంలో 11 డీప్–సీ కమ్యూనికేషన్ కేబుల్స్ ధ్వంసమయ్యాయి. సముద్ర గర్భంలోని తమ మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి కృషి చేస్తున్నామని యూకే అధికారులు అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగినప్పటి నుంచి బ్రిటన్–రష్యా మధ్య పిల్లి, ఎలుక తరహాలో పోరాటం జరుగుతూనే ఉంది. అది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని యూకే నిపుణులు అంటున్నారు.