
తునికాకు సేకరణకు అడుగులు
● జిల్లాలో తొమ్మిది యూనిట్లకు టెండర్లు పూర్తి ● మే మొదటి వారంలో సేకరణ ప్రారంభించే అవకాశం
కౌటాల(సిర్పూర్): సంకలో జోలె, మెడలో నీళ్ల బాటిల్ వేసుకుని.. అడవిలో తిరుగుతూ దాడికి వచ్చే జంతువులతో పోరాడి కోసుకొచ్చే బీడీ ఆకు(తునికాకు) సేకరణ వేళాయింది. వేసవి పంటగా భావించే తునికాకు సేకరణ జిల్లాలోని గిరిజనులకు ఏళ్లుగా ఉపాధి కల్పిస్తోంది. సాధారణంగా ఆకు సేకరణ కోసం ఏటా మార్చిలో అటవీశాఖ టెండర్లు నిర్వహిస్తుంది. ఆ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏప్రిల్‌లో ఫ్రైనింగ్(కొమ్మ కొట్టడం) పూర్తి చేసి తునికాకు సేకరణను ప్రారంభిస్తారు. ప్రస్తుతం జిల్లాలో 9 యూనిట్లకు టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో మిగిలిన వాటికి కూడా టెండర్ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఫ్రైనింగ్‌తో నాణ్యమైన ఆకు
తునికాకు సేకరణకు ముందు అటవీ ప్రాంతాల్లో కొమ్మకొట్టే (ఫ్రైనింగ్) ప్రక్రియ చేపడతారు. దీని ద్వారా ఆకు ఎక్కువగా రావడమే కాకుండా నాణ్యతతో వస్తుంది. అనంతరం మేలో కూలీలతో ఆకు సేకరణ ప్రారంభిస్తారు. అటవీ గ్రామాల ప్రజలు తునికాకు సేకరణపై మక్కువ చూపుతుంటారు. దీని ద్వారా వేసవిలో ఉపాధి పొందుతారు. అలాగే ఆకులను వేలం వేసి వచ్చిన ఆదాయంలో కూలీలకు తిరిగి బోనస్ రూపంలో చెల్లిస్తారు. గతంలో జిల్లాలోని అడవుల్లో పులులు సంచరిస్తున్నాయని కారణంతో కొన్నేళ్లపాటు తునికాకు సేకరణకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించడంపై కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
26 వేల స్టాండర్ట్ బ్యాగుల లక్ష్యం..
తునికాకు సేకరణలో గిరిజనులతోపాటు మారుమూల గ్రామాల ప్రజలు పాల్గొంటారు. జిల్లాలో 6.42 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో 11 ఫారెస్టు రేంజ్‌లు, 74 సెక్షన్లు ఉన్నాయి. తునికాకు సేకరణను 15 యూనిట్లుగా విభజించి 179 కల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది 26 వేల స్టాండర్ట్ బ్యాగుల తునికాకు సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. వెయ్యి కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగు(ఎస్‌బీ)గా పరిగణిస్తారు. రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచారు. 15 యూనిట్లకు ఇప్పటివరకు తొమ్మిది యూనిట్లకు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. త్వరలోనే మరోసారి టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే కొమ్మ కొట్టడం పనులు చేపట్టనున్నారు. మే మొదటి వారం నుంచి తునికాకు సేకరణ ప్రారంభించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది 12 యూనిట్ల పరిధిలోని 151 కల్లాల్లో తునికాకు సేకరించారు. తునికాకు సేకరణ కూలీలకు సుమారు రూ.5 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.
గిరిజనులకు ఉపాధి
తునికాకు సేకరణను గిరిజనులతోపాటు గ్రామీణ రైతులు రెండో పంటగా భావిస్తారు. కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్(యూ), పెంచికల్‌పేట్ మండలాల్లో వేసవిలో 20 వేలకు మంది పైగా ప్రజలు తునికాకు సేకరిస్తుంటారు. ఈ సీజన్‌లో ఒక్కో కుటుంబం రోజుకు సుమారు రూ.500 వరకు సంపాదిస్తారు. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో ఆశ్రమాలు, గురుకులాల నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థులతోపాటు వృద్ధులు కూడా మండుటెండలను సైతం లెక్క చేయకుండా పనులకు వెళ్తుంటారు. 50 ఆకుల చొప్పున కట్టలు కట్టి కల్లాలకు తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఒక్కో కుటుంబం మొత్తం సుమారు రూ.25 నుంచి రూ.30 వేలు సంపాదిస్తారు. ప్రభుత్వం జిల్లాలో తునికాకు సేకరణకు టెండర్ల ప్రక్రియ చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తునికాకు కట్ట ధర పెంచడంతో పాటు కూలీలకు ప్రమాదం జరిగితే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.