
నేడు జిల్లాకేంద్రంలో విద్యుత్ సరఫరా బంద్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలోని 11 కేవీ వీఐపీ ఫీడర్‌తో పాటు 11 కేవీ నవాబ్‌పేట ఫీడర్ పరిధిలో చెట్ల కొట్టివేత కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్‌కో ఏడీ తవుర్యనాయక్, టు ఏఈ ఆదిత్య ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. దీంతో రామయ్యబౌలి, వేపురివేగిరి, హబీబ్‌నగర్, గోల్‌మజీద్, రాంనగర్, గణేష్‌నగర్, హన్మాన్‌పుర, రైమానియా మజీద్, పాతపాలమూరు, ఫరీద్ మజీద్ ప్రాంతం, సంజయ్‌నగర్, బోయపల్లిగేట్, మోతీనగర్, కొత్తగంజ్, నవాబ్‌పేట రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.
వచ్చే నెల నుంచి వృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వయోవృద్ధులకు వచ్చే నెల నుంచి ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించేందుకు జిల్లా అధికారులు అంగీకరించారని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు చెప్పారు. ఆదివారం స్థానిక మెట్టుగడ్డలోని ‘ఫోరం’ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘ప్రజావాణి’కి జిల్లా నుంచి వయోవృద్ధులు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ విజయేందిర బోయి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో ఆమె స్పందించి అందరికీ అనుకూలమైన జిల్లా కోర్టు పక్కనున్న తహసీల్దార్ అర్బన్ మండల కార్యాలయంలో ప్రతినెలా మొదటి బుధవారం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.
1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కల్వకుర్తి రూరల్: రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్‌మిల్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని బుకాయించగా.. ఈ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. కాగా.. వారు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు.
రాత్రి 10 గంటల వరకు..
రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో ఏఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు, డీఎం రాజేందర్‌ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమాస్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు.