
నిర్వహణ అస్తవ్యస్తం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన రైతువేదికలు సమస్యలతో సతమమవుతున్నాయి. 31 నెలలుగా ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేయక వేదికలు నిస్తేజంగా మారాయి. కరెంట్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ, స్టేషనరీ, తాగునీటి సౌకర్యాల కల్పనకు డబ్బులు లేక ఏఓలు, ఏఈఓలు ఇబ్బంది పడుతున్నారు. వీటి కోసం అధికారులు సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా రైతు వేదికల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో ఎప్పుడు కరెంట్ కట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రైతు వేదికల నిర్వహణపై పట్టింపు లేకుండాపోయింది.
● గత ప్రభుత్వం జిల్లాలో 86 రైతు వేదికలను నిర్మించేందుకు రూ.18.92 కోట్లు మంజూరు చేసింది. ఒక్కొక్క నిర్మాణానికి రూ.22 లక్షల వరకు ఖర్చు చేశారు. 150 నుంచి 200 మంది కూర్చునే సామర్థ్యంతో వేదికలను నిర్మించారు. టేబుళ్లు, కుర్చీలు, మైక్ సిస్టంతో పాటు ఇతర సామగ్రిని సమకూర్చింది. ఏఈఓ, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కోసం రెండు గదులు, రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్‌హాల్‌తో కూడిన రైతు వేదికలను నిర్మించారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ఏఈఓ ను నియమించి వారి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైతు వేదికలను నిర్మించింది. ఒక్కో రైతువేదిక నిర్వహణ కోసం మొదట నెలకు రూ.3 వేలు ఇచ్చింది. ఈ నిధులు సరిపోకపోవడంతో వ్యవసాయశాఖ ప్రతిపాదనల మేరకు రైతు వేదికల నిర్వహణకు రూ.9 వేల చొప్పున అందజేస్తామని గత ప్రభత్వం ప్రకటించింది. అయితే 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్కపైసా విడుదల కాలే దు. 86 రైతు వేదికలకు సంబంధించి 31 నెలలకు నిర్వహణ నిధులు రూ.2,31,57,000 మేర పేరుకుపోయాయి. నిధులు విడుదల చేయకపోవడంతో విద్యుత్ చార్జీలు, పారిశుద్ధ్య నిర్వహణ, మరమ్మతు లు, స్టేషనరీ, రైతు శిక్షణ, తాగునీటి సౌకర్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యవసాయ అధికారులు (ఏఓ), మండల వ్యవసాయ విస్తరణ అధి కారులు (ఏఈఓలు) వాపోతున్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.2.79 లక్షలు రావాల్సి ఉందని, తమ సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఒక్కో వేదికకు రూ.10 వేల నుంచి రూ. 12 వేల చొప్పున విద్యుత్ చార్జీలు బకాయిలు పేరుకుపోయినట్లు చెబుతున్నారు. ఒక్కో కేంద్రానికి మినీ భూసార పరీక్ష ల్యాబ్ కిట్లను అందజేసి వీటి ద్వారా వేదికల్లో పరీక్షలు చేయాల్సి ఉన్నా నిధులు లేకపోవడంతో ఈ ప్రక్రియ కూడా అటకెక్కింది.
● శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు సమావేశమై సాగు సమస్యలు, ఆధునిక పద్ధతులపై చర్చించేందుకు వీలుగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఒక రైతు వేదికను వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ కోసం ఎంపిక చేశారు. ప్రతి మంగళవారం రైతునేస్తం నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా నెలల తరబడి నిధులు విడుదల చేయకపోతే ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తామని ఏఈఓలు ప్రశ్నిస్తున్నారు.
ఊరికి దూరంగా...
ఒక్కో రైతు వేదిక పరిధిలో 5 వేల ఎకరాలు ఉండేలా 5–6 గ్రామాలను చేర్చారు. కానీ వీటిని ఊరికి దూరంగా నిర్మించడంతో రైతులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతి రైతు వేదికకు ఒక విస్తరణ అధికారి బాధ్యులుగా ఉండగా, వీరిలో 37 మంది మహిళలే ఉన్నారు. ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికల్లో వీరు ఒక్కరే విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నారు. కనీసం అటెండర్ కూడా లేకపోవడంతో ఏఈఓనే తాళం తీసుకుని శుభ్రం చేసుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఈఓలు తప్పనిసరిగా వారి క్లస్టర్ పరిధిలోని రైతువేదిక నుంచి జియో ట్యాగింగ్ ద్వారా తమ హాజరు నమోదు చేసుకోవాలి. ప్రతిరోజు విధిగా రైతు వేదికకు వెళ్లి హాజరునమోదు చేసుకున్న తర్వాతే క్షేత్ర స్థాయికి వెళ్లాల్సి వస్తుంది.
రైతు వేదికల నిధుల విడుదలలో జాప్యం
భారంగా విద్యుత్ చార్జీలు, పారిశుద్ధ్య పనులు
వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణతోఅదనపు భారం
సొంత డబ్బు ఖర్చు చేస్తున్న ఏఓ, ఏఈఓలు