
ఎల్‌ఆర్‌ఎస్ ఆదాయం రూ.19.06 కోట్లు
మంచిర్యాలటౌన్: ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులకు సోమవారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో చెల్లించి సద్వినియోగం చేసుకున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 55,697 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 31,093మంది దరఖాస్తులు ఎల్‌ఎస్‌ఎస్ ఫీజుకు ఆమోదం పొందాయి. మార్చి 31వరకు చెల్లించిన వారికే 25శాతం రాయితీ ప్రకటించగా.. రంజాన్ పండుగ రోజు కూడా జిల్లా వ్యాప్తంగా 924మంది ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూ.2.27కోట్లు చెల్లించారు. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారికి నేరుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించగా 243మంది సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా 7,408 దరఖాస్తులకు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ద్వారా రూ.19.06 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం లభించింది.