
వేద పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో వేద పాఠశాల విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన రాజేందర్ తనయుడు మణికంఠ(17) వేద పాఠశాలలో చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గోదావరి నది పుష్కరఘాట్ వద్దకు వెళ్లిన మణికంఠ నది కింద భాగంలో బురదలో పడి ఉన్నాడు. గమనించిన భక్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది మణికంఠను బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న బాసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్ పుష్కర ఘాట్లను పరిశీలించారు. విద్యార్థి విద్యుత్‌షాక్‌తో మరణించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. గతనెల 21న వేద పాఠశాలకు చెందిన విద్యార్థి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లోహిత్‌పై దాడి జరిగింది. 13 గంటల తర్వాత గుర్తించి ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తాజాగా అదే పాఠశాలకు చెందిన విద్యార్థి మణికంఠ అనుమానాస్పదంగా మృతిచెందాడు. దీంతో వేదపాఠశాలలో ఏం జరుగుతుందో అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

వేద పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి