
బెట్టింగ్ మత్తులో యువత
● రూ.లక్షల్లో పందెం.. ● యువకుల జేబులు ఖాళీ ● గ్రామీణ ప్రాంతాలకు చేరిన జూదం
చెన్నూర్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువతను చిత్తు చేస్తోంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జోరుగా సాగుతోంది. జూదం వ్యసనంలా మారి జేబులు ఖాళీ చేస్తోంది. క్రికెట్, ఆటగాళ్లపై అభిమానం హద్దు మీరి యువతలో వ్యసనంగా మారుతోంది. ఆటను చూసి ఆనందించాల్సి పోయి ఏకంగా బెట్టింగ్‌కు పాల్పడుతూ ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. వేలాది రూపాయలు బెట్టింగ్ కాస్తూ కొందరు యువకులు అప్పుల పాలవుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ చేరింది. బెంగళూరు రాయల్ చాలెంజ్, గుజరాత్ టైటాన్స్ జట్లపై కోటపల్లి మండలంలోని ఒక గ్రామంలో పది మంది యువకులు రూ.10వేల చొప్పున రూ.లక్ష బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన కోటపల్లిలోనే కాకుండా జిల్లాలో ఏ మేరకు బెట్టింగ్ సాగుతుందో చెప్పకనే చెబుతోంది. ‘‘మామ పది వేలు పోయినయిరా. బుధవారం ఆర్సీబీ గెలుస్తుందని పది వేలు బెట్టింగ్ పెట్టిన జీటీ గెలిచిందిరా. నా డబ్బులే కాదురా పది మందిమి ఆర్సీబీ గెలుస్తుందని పది వేల చొప్పున బెట్టింగ్ పెటినం. అందరి డబ్బులు పోయినయ్..’’ ఇదీ చెన్నూర్‌లో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుందనడానికి వీరి సంభాషణే ఉదాహరణగా చెప్పొచ్చు.
ముందుగానే అంచనా..
మ్యాచ్‌కు ముందుగానే జట్టు బలాలను అంచనా వేస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు అభిమాన కెప్టెన్లపై నమ్మకంతో బెట్టింగ్‌కు దిగుతుండగా.. మరికొందరు జట్టులోని క్రీడాకారులు ఆటతీరుపై బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. ఒక్కోసారి వారి అంచనాలు తారుమారై నష్టపోతున్నట్లు తెలిసింది.
ఫోన్ పే ద్వారా చెల్లింపులు..
బెట్టింగ్ చెల్లింపులు అన్నీ ఫోన్ పే ద్వారానే సాగుతున్నాయి. బెట్టింగ్‌లో పాల్గొనే వ్యక్తులు మధ్యవర్తికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు తరపున బెట్టింగ్ కాచిన వ్యక్తికి మధ్యవర్తి డబ్బులు చెల్లించే విధంగా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అధికారులు స్పందించి బెట్టింగ్‌లకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మే నెల 25న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వరకు బెట్టింగ్‌ల జోరు కొనసాగే అవకాశాలున్నాయి.