
అర కిలో బంగారం ఆశ చూపి..
● రూ.4.50 లక్షలు వసూలు ● గుప్తనిధుల పేరిట మోసం.. ● ముగ్గురి రిమాండ్.. పరారీలో ఒకరు ● రూ.1.47 లక్షలు రికవరీ..
ఖానాపూర్: అరకిలో బంగారం ఆశ చూపి రూ.4.50 లక్షలు వసూలు చేసిన ఉదంతం ఖానాపూర్ సర్కిల్ పరిధిలోని కడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ సీహెచ్.అజయ్, కడెం ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన సాదుల నరేశ్ హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అక్బర్ వద్ద కొంతకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కడెం మండలం అటవీ ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని రూ.4.50 లక్షల చెల్లిస్తే అరకిలో బంగారం ఇస్తామని ఆశ చూపుతూ నమ్మబలికాడు. గత నెల 31న కడెం మండలానికి వచ్చిన అక్బర్‌ను నరేశ్‌తోపాటుమరో ముగ్గురు యువకులు కడెం మండలంలోని కొత్త మద్దిపడగ శివారులోని అటవీ ప్రాంతానికి కారులో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక డబ్బులు లాక్కొని బెదిరించి వెళ్లగొట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అక్బర్ వెంటనే ఈ విషయమై అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు. నరేశ్ తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని రూ.4.50 లక్షలు అవసరం ఉందని అందుకు బదులుగా బంగారం, ఆస్తి పేపర్లు కుదువ పెడతానని తనకు చెప్పడంతో తాను పై నగదును నరేశ్‌కు ఇచ్చానని బాధితుడు ఫిర్యాదులో తమకు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. గుప్త నిధుల కోసం సదరు యువకులతో కలిసి అన్వేషించి మోసపోయిన అక్బర్ తమను సైతం తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఫిర్యాదు చేసినట్లు విచారణలో వెలుగు చూసిందన్నారు. ఈ ఘటనలో అక్బర్ నుంచి డబ్బులు వసూలు డబ్బుల నుంచి రూ.1.47 లలు రికవరీ చేయడంతోపాటు గోసంపల్లె గ్రామానికి చెందిన సాదుల నరేశ్, అదే గ్రామానికి చెందిన భూక్యా వంశీ, ఖానాపూర్ పట్టణానికి చెందిన మగ్గిడి నితిన్, పెంబి మండల కేంద్రానికి చెందిన ఆరె చింటుతోపాటు తప్పుడు ఫిర్యాదు చేసిన హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అక్బర్‌పై సైతం కేసు నమోదు చేశామని వివరించారు. శుక్రవారం వంశీతోపాటు నితిన్, చింటులను రిమాండ్ చేశామని తెలిపారు. నరేశ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. నాలుగు రోజుల వ్యవధిలో సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్న ఖానాపూర్ సీఐతోపాటు కడెం ఎస్సై, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.