
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన నృత్య, సంగీత,నాటక ప్రదర్శనలు మంత్రిముగ్ధుల్ని చేశాయి. రామ చరితతోపాటు, 500 ఏళ్ల నుంచి రామ మందిర ప్రాణ ప్రతిష్ట వరకు జరిగిన విశేషాలను ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. ‘బధాయ్, చారీ, గూమర్, భవాయ్, ఝుమర్, ధోబియా, రాయ్, రస్లీల, మయూర్, ఖయాల్ నృత్యం, సతారియా’వంటి జానపద నృత్యాలతో కళాకారులు అమితానందం కల్గించారు.
భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, మణిపూరి, మోహని ఆట్టం, కథాకళి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ముగిసేదాకా ఈ నృత్య ప్రదర్శనలు జరిగాయి. సినీ, క్రీడా రంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ దిగ్గజాలు ఈ నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలను సెల్‌ఫోన్లలో బంధించారు. చలనచిత్ర, సంగీత కళాకారులు బాల రాముడిపై అభిమానాన్ని పాటల రూపంలో చాటారు. ప్రముఖ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, సోను నిగమ్ ‘రామ్ భజన్’ చేశారు. అనురాధ పౌడ్‌వాల్, మాలినీ అవస్తీ ‘రామాష్టకం’తో అలరించారు. ‘రాం సియా రాం’ అంటూ సోను నిగం పాడిన పాట ఆకట్టుకుంది.