
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడికి ఆదివారం సూర్య భగవానుడు తిలకం అద్దడం చూసి భక్తులు పులకించిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన తిలకం 4 నిమిషాలపాటు కొనసాగడం అమితంగా ఆకట్టుకుంది. కొందరు గర్భాలయంలో ఆనందంతో నృత్యాలు చేశారు.
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సూర్యతిలకం అద్దే కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అలాగే ప్రభు శ్రీరామ్‌లల్లాకు అర్చకులు ప్రత్యేకంగా మహా మస్తకాభిషేకం నిర్వహించినట్లు తెలియజేసింది. 56 పదార్థాలతో కూడిన భోగ్‌ను శ్రీరాముడికి నివేదించారు. ప్రత్యేక హారతి ఇచ్చారు. గర్భాలయంలో సూర్యతిలకం, మహా మస్తకాభిషేకాన్ని నేరుగా చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తన్మయులయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 10 లక్షల మందికిపైగా తరలివచ్చినట్లు అంచనా.