AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు | Bibhav Kumar attacked me with full force says AAP MP Swati Maliwal | Sakshi
Sakshi News home page

AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు

Published Sat, May 18 2024 5:21 AM | Last Updated on Sat, May 18 2024 5:21 AM

చెంప ఛెళ్లుమనిపించాడు 

స్వాతి మలివాల్‌ ఫిర్యాదులో సంచలన విషయాలు 

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌ తనపై చేసిన దాడిపై ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్‌ఐఆర్‌ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి.  

దెబ్బలకు తాళలేక నడవలేకపోయా 
గురువారం బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్‌ను కలిసేందుకు డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్‌ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్‌కు గురయ్యా. 

సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్‌ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్‌కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్‌ పట్టుకుని లాగాడు. షర్ట్‌ బటన్స్‌ కొన్ని ఊడిపోయాయి. షర్ట్‌ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. 

పిరియడ్‌ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్‌ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్‌ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్‌ వాంగ్మూలం ఇచ్చారు.  

ముఖంపై అంతర్గత గాయాలు 
శుక్రవారం మలివాల్‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్‌ కేస్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్‌ శుక్రవారం తీస్‌ హజారీ కోర్టు మేజి్రస్టేట్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్‌ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్‌చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్‌ అంటున్నట్లు వీడియోలో ఉంది.  

పొలిటికల్‌ హిట్‌మ్యాన్‌.. 
మలివాల్‌ శుక్రవారం ‘ఎక్స్‌’లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘ పొలిటికల్‌ హిట్‌మ్యాన్‌ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్‌ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్‌చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్‌ చేశారో ఆమె పేర్కొనలేదు. 

కేజ్రీవాల్‌ ఇంటికి ఫోరెన్సిక్‌ బృందం 
కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్‌ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం మలివాల్‌ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్‌ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్‌ ఇచి్చన సమన్లను బిభవ్‌ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్‌సర్‌కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని          సంప్రదించారు. 

ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్‌ 
‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్‌ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్‌ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్‌ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌చేశారు.  

ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి 
మలివాల్‌ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్‌ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్‌ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్‌ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్‌ బటన్లు ఊడిపోయాయని ఎఫ్‌ఐఆర్‌లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్‌ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి      ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement