
నవరాత్రి వేడుకలను నిష్టగా ఆచరించేందుకు ఆ వివాహిత ఏడాదిగా ఎదురుచూస్తూ వచ్చింది. తీరా ఆ సమయం వచ్చేసరికి అందులో పాల్గొనలేకపోయింది. ఆ బాధతోనే మానసికంగా కుంగిపోయింది. తన బదులు ఆ పూజలు చేసేందుకు భర్త సైతం సిద్ధం అయ్యాడు. అయినా కాని ఆమె కోలుకోలేకపోయింది. చివరకు.. ఏకంగా ప్రాణమే తీసుకుంది!.
ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని(36).. భర్త ముఖేష్ సోనీ, పిల్లలు జాన్వి, మాన్విలతో కలిసి నివసిస్తుంది. అయితే, ప్రియాంషా సోనికి దుర్గాదేవి అంటే అపరామైన భక్తి. ప్రతి ఏడాది ఎంతో ఇష్టంగా నవరాత్రి వేడుకలు జరుపుకునేది. అలాగే, ఈసారి నవరాత్రి వేడుకలు నిర్వహించుకోవాలని అంతా సిద్ధం చేసుకుంది. భర్త ముఖేష్‌తో చెప్పి పూజకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుంది.
మార్చి 30వ తేదీన చైత్ర నవరాత్రి ప్రారంభమైంది. అయితే మొదటి రోజే ప్రియాంషాకి పీరియడ్స్ వచ్చింది. దీంతో ఆమె నవరాత్రి పూజల్లో పాల్గొనలేకపోయింది. ఏడాదిగా ఆ పూజ కోసమే ఎదురు చూసిన ఆమె.. నాటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఇది సహజంగా జరిగేదే అని భర్త ముఖేష్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె వినిపించుకోలేకపోయింది. బదులుగా తాను పూజలు చేస్తానని చెప్పినా వినలేదు. తప్పు జరిగిపోయిందంటూ ఏడుస్తూ ఉండిపోయింది. దీంతో పుట్టింట్లో అయినా ఆమె సంతోషంగా ఉంటుందని భావించి కొన్నాళ్లు ఉండమని దింపి వచ్చాడు.
అయితే.. తల్లిదండ్రులు ఓదార్చిన ఆమె ఆ బాధ నుంచి బయటపడలేకపోయింది. ఈ బాధలోనే చనిపోవాలని విషం తాగింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, చికిత్స కోసం ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అయితే, ఇంటికి వచ్చాక ప్రియాంషా ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ, బుధవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com