
దేశంలో కులగణనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన సున్నితమైన అంశమని పేర్కొంది. అయితే దీనిని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని తెలిపింది. ఈ మేరకు కేరళలోని పాలక్కడ్‌లో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో సంస్థ ప్రతినిధి సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. కులగణ జాతీయ ఐక్యత, సమగ్రతకు చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.
‘కుల గణన అనేది చాలా సున్నితమైన అంశం. దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలి. కొన్నిసార్లు ప్రభుత్వాలు డేటా అవసరం కోసం దీనిని చేపట్టవచ్చు. అయితే ఇదికేవలం ఆ వర్గాలు కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. కానీ.. కుల గణనలను ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించకూడదు’ అని అన్నారు.
ఈ అంశంపై తీవ్రమైన చర్చల మధ్య, కుల గణనపై ఆర్‌ఎస్‌ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కసరత్తును నిర్వహించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొంది. ‘ఇటీవల కాలంలో కులగణన అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిని పూర్తిగా సమాజహితానికే వాడతారని భావిస్తున్నాం. వీటిని నిర్వహించే క్రమంలో అన్నిపక్షాలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.