
సాక్షి, ఢిల్లీ: దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం మోదీ ఇటలీలోని అపులియా బయలుదేరారు.
మోదీ మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశీ పర్యటన కావటం గమనార్హం. జూన్ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్‌కు హాజరుకావాలని ఇటలీ.. భారత్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారు. సమ్మిట్ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఇక జీ7 50వ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్ దేశాధినేతలు ఇటలీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వారికి ఘనస్వాగతం పలికారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వార్షిక సమావేశానికి భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది.
కాగా, గత ఏడాది జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 దేశాల సదస్సుకు హాజరైన మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ప్రపంచ నేతలతో ఆయన చర్చలు జరిపారు.