
న్యూఢిల్లీ: ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి 15 వరకు జరిగే జీ7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘జీ7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని మంత్రి జార్జియా మెలోని గురువారం(జూన్6) ఫోన్‌లో మోదీని ఆహ్వానించారు.
ఈ ఆహ్వానానికి మోదీ ఓకే అన్నారు. తనను ఆహ్వానించినందుకు మెలోనికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు’అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణమార్పులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు.
కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇటలీ,జపాన్, యూకే,అమెరికా జీ7 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. జీ7 సదస్సు సైడ్‌లైన్స్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.