
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై 26శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్‌లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!.
ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్‌కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.

ఎప్పటి నుంచి అమలు..
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది.
లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం.
ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.
ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్‌ను ప్రకటించారు.