
తూర్పు లద్దాఖ్‌లో పరిణామంపై ఎస్.జైశంకర్ వ్యాఖ్య
ఇతర సానుకూల చర్యలకిదో అవకాశమన్న విదేశాంగ మంత్రి
బ్రిస్బేన్: భారత్, చైనాలు సరిహద్దుల్లో అత్యంత సమీపంలో మోహరించిన బలగాల ఉప సంహరణపై కొంత పురోగతి సాధించడం స్వాగతించదగిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. అనంతర చర్యలకు ఈ పరిణామం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన డెమ్‌చోక్, డెప్సాంగ్‌ల నుంచి రెండు దేశాలు ఇటీవల బలగాలను ఉపసంహరణను పూర్తి చేసుకోవడం, అనంతరం భారత్ ఆర్మీ పరిశీలనాత్మక గస్తీ జరుపుతున్న క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మంత్రి జైశంకర్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వాస్తవా«దీన రేఖ వెంబడి 2020కు ముందు లేని ప్రాంతాల్లో చైనా బలగాలు ముందుకు చొచ్చుకువచ్చాయి. దీంతో మేం కూడా బలగాలను మోహరించాం. కొన్ని ఇతర కారణాలు కూడా ఇందుకు తోడయ్యాయి. దాదాపు నాలుగేళ్లపాటు బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి.
ఏదైనా అనూహ్య సంఘటన జరిగే అవకాశమున్న పరిస్థితి అది. తాజాగా భారత్, చైనాలు కొంత పురోగతి సాధించాయి. సేనలను వెనక్కి తీసుకున్నాయి. ఇది స్వాగతించదగిన పరిణామం. ఇది ఇతర సానుకూల చర్యలకు దారి తీసే అవకాశముంది’అని ఆయన అన్నారు. ఉక్రెయిన్, పశి్చమాసియాల్లో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన..ఈ సమస్యల పరిష్కారానికి భారత్ తన వంతు కృషి కొనసాగిస్తోందని వెల్లడించారు.