
రెండు తలల పాము, ఆకర్షించే చెంబు, ‘ఇదొక కదిలే యత్రం.. ఇది చదివే మంత్రం’, రైస్ పుల్లింగ్, యాంటిక్ పీస్‌లు అంటూ జనాన్ని బురిడీ కొట్టించి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న గ్యాంగ్ లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ తరహా మోసాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ అలవాటు పడ్డ ప్రాణం దాన్ని ఎలా వదలుకుంటుంది అన్నట్లు కొందరు దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
అవి అరుదైనవి అని చెబుతూ, వాటికి మంత్ర శక్తి ఉందని చెబుతూ, ఇది ఉంటే మీరు కోట్లకు పడగలెత్త వచ్చు అంటూ అమాయక ప్రజల్ని మోసానికి గురి చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.. గత దశాబ్ద కాలంలో ఈ తరహా మోసాలు చాలా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు వెర్రి తలలు వేసుకుని వీటిని కొనుగోలు చేస్తూ భారీగా మోసపోతూనే ఉన్నారు.
ఇదే తరహాలో అరుదైన బల్లులను అమ్మబోయి ఒక గ్యాంగ్ పోలీస్ లకు పట్టుబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగర్హ్ లో అరుదైన బల్లి జాతిగా పేర్కొనబడే టోకే గెక్కో కు చెందిన 11 బల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ముఠాగా ఏర్పడిన కొందరు వీటిని అమ్మడానికి యత్నించే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో వారిని వలవేసి చాకచక్యంగా పట్టుకున్నారు. వీటిని అమ్మే ముగ్గురు స్మగ్లర్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 60 లక్షలకు బేరం పెట్టుకుని వీటిని అమ్మడానికి యత్నించే సమయంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతరించిపోతున్న బల్లి జాతిగా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టంలో పేర్కొనడంతో దీన్ని పట్టుకోవడం, అమ్మడం నేరం కిందకు వస్తుంది.
నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష
ఈ బల్లులను అమ్మకానికి పెట్టడం తీవ్ర నేరం కనుక, ఒకవేళ వారు నేరం చేసినట్లు రుజువైతే ఏడేళ్ల వరకూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అత్యంత అరుదుగా కనిపించే ఈ బల్లులు.. భారత్ లో మాత్రం అస్సాం, అరుణాచల్ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటిని అక్రమంగా రవాణా చేస్తూ ఆగ్నేసియాలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వీటికి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉండటంతో అక్కడకు దొడ్డిదారిన తరలిస్తూ ఉంటారు.
ఈ స్మగ్లింగ్ కు పాల్పడిన వారు దేబాశిస్ దోహుతియా(34), మనాష్ దోహుతియా(28), దిపాంకర్(40)లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ బల్లులను వారు అరుణాచల్ ప్రదేశ్ నుండి తెచ్చినట్లు సిట్ విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. ఒక్కో బల్లిని రూ. 60 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లోని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
ఇదొక అరుదైన బల్లి జాతి
టోకే గెక్కో అనేది పశ్చిమాసియా ప్రాంతంలో కనిపించే అరుదైన బల్లి జాతి. ఇది పెద్దవిగా ఉండటమే కాదు.. వివిధ రంగుల్లో ఉంటాయి. ఇవి రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. దీన్ని చాలా చోట్ల అదృష్టంగా భావిస్తూ ఉండటంతో వాటికి డిమాండ్ లక్షల్లో ఉంటుంది.