
వెయ్యి కోట్ల రూ. పత్రా చాల్ కుంభకోణంలో సస్పెన్స్ వీడింది.
సాక్షి, ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది ముంబై స్పెషల్ కోర్టు. ఆగష్టు 4వ తేదీవరకు ఆయన్ని కస్టడీకి అనుమతిస్తూ సోమవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది.
పత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ని దర్యాప్తు విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సోమవారం వైద్య పరీక్షల అనంతరం ముంబై పీఎంఎల్‌ఏ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టింది. నాలుగుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఏజెన్సీ ముందు ఆయన ఒక్కసారే హాజరయ్యాడని, ఈ గ్యాప్‌లో ఆయన ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశాడని, కీలక సాక్షిని ప్రభావితం చేయాలని చూశారని ఈడీ కోర్టులో వాదించింది. ఈ మేరకు 8 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని కోరింది.
మరోవైపు సంజయ్ రౌత్ తరపు న్యాయవాది అశోక్ ముండార్గి ఈ అరెస్ట్‌ను.. రాజకీయ కుట్రగా న్యాయస్థానానికి నివేదించారు. రాజకీయ కోణంలో ఈ అరెస్ట్‌జరిగిందని, ఆయనకు గుండె సమస్య ఉందని, ఈ మేరకు సర్జరీ కూడా జరిగిందని చెబుతూ.. కోర్టుకు పత్రాలు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. చివరికి సంజయ్ రౌత్‌కు ఆగష్టు 4వ తేదీ వరకు రిమాండ్‌కు అనుమతించింది. నాలుగు రోజుల కస్టడీతో పాటు ఇంటి భోజనానికి ఆయన్ని అనుమతించాలని ఈడీని ఆదేశించింది కోర్టు.
చదవండి: సంజయ్ రౌత్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది- నవనీత్‌కౌర్