
న్యూఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇకపై 15 రోజుల్లోగా నోటీసు(ఈ–చలాన్) జారీ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నోటీసును వాహనదారుడికి చేరవేయాలి. చలాన్ సొమ్మును వాహనదారుడు చెల్లించేదాకా సదరు ఎలక్ట్రానిక్ రికార్డును భద్రపర్చాలి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహన చట్టం–1989కు ఇటీవల సవరణ చేయడం తెల్సిందే.
కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, శరీరంపై ధరించే కెమెరా, స్పీడ్ గన్, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్‌పీఆర్) వంటి సాంకేతిక పరికరాలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.
అధికంగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కీలకమైన జంక్షన్లు, నోటిఫికేషన్‌లో ప్రస్తావించిన 132 నగరాలతోపాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా, హైవేల శాఖ సూచించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. నోటిఫై చేసిన నగరాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 నగరాలు ఉన్నాయి.