
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
పథార్ ప్రతిమా మండలంలోని ధోలాహట్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9గం. ప్రాంతంలో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు.
ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయని.. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
#Breaking: 7 people, including 4 children, killed in a gas cylinder blast at Pathar Pratima in Bengal''s South 24 Parganas district.#WestBengal #South24Parganas #CylinderBlast #Blast pic.twitter.com/JC3togdyt5
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 31, 2025