
ముస్కాన్ రస్తోగీ(muskaan rastogi).. గత పదిరోజులుగా ఇటు మీడియా అటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. ప్రాణంగా ఆమెను ప్రేమించిన భర్తను.. గంజాయి మత్తులో ప్రియుడితో కలిసి జోగుతూ ముక్కలు చేసి, ఆపై డ్రమ్ములో ఆమె దాచిన వైనం ‘మీరట్ ఉదంతంగా’గా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆమెలో సత్పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతున్నారు ఎంపీ అరుణ్ గోవిల్.
టీవీ రామాయణంతో అన్ని భాషల ప్రజలకు చేరువైన నటుడు అరుణ్ గోవిల్.. మీరట్ ఎంపీ అనే సంగతి తెలిసిందే కదా. తాజాగా.. ఆదివారం చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలకు ఆయన 1,500 రామాయణ ప్రతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన నుంచి రామాయణం ప్రతి అందుకున్న వెంటనే ముస్కాన్ భావోద్వేగానికి గురైందని ఆయన అన్నారు.
‘‘రామాయణం పుస్తకాన్ని(Ramayana Book) అందుకోగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయ్. ఇది ఆమె జీవితంలో కచ్చితంగా చీకట్లు పారదోలుతుందని చెప్పాను. ఇది చదివైనా జీవితంలో బాగుపడమని.. మంచి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ముస్కాన్‌తో అన్నాను’’ అని అరుణ్ గోవిల్(Arun Govil) మీడియాకు వివరించారు. ముస్కాన్‌తో పాటు ఈ కేసులో సహా నిందితుడు సాహిల్ శుక్లా కూడా రామాయణం అందుకున్నాడట. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంచాలని అరుణ్ గోవిల్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటికీ రామాయణం అనే కార్యక్రమం చేపట్టిన ఆయన.. ఇలా ఖైదీలకూ పంపిణీ చేశారు.

మీరట్‌లో మార్చి 4వ తేదీన సౌరభ్ తివారీ హత్య జరిగింది. భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సీల్ చేసిందామె. ఆపై ప్రియుడితో కలిసి జాలీగా ట్రిప్పులు వేసింది. భర్త మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో దొరికిపోతామనే భయంతో తన తల్లిదండ్రులకు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో వాళ్లే ఆమెను దగ్గరుండి పోలీసులకు అప్పజెప్పారు.
ఈ కేసులో భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు తరలించారు. మొదట్లో తమకు భోజనం వద్దని.. గంజాయి కావాలని.. ఇద్దరినీ ఓకే బ్యారక్ ఉంచాలంటూ జైలు సిబ్బందితో గొడవలకు దిగారు వాళ్లు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణలో వాళ్లకు చికిత్స అందింది. అయితే వైద్య పర్యవేక్షణ ముగియడంతో అధికారులు వాళ్లకు పనులు అప్పజెప్పబోతున్నారు. రిమాండ్ మీద ఉన్న వీళ్లు.. కోర్టు విచారణ పూర్తయ్యేదాకా కుట్లు అల్లికలతో ముస్కన్, కూరగాయాలు పండిస్తూ సాహిల్ గడపబోతున్నారు.
అది ఏఐ జనరేటెడ్ వీడియో!
రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ ఓ పోలీస్ అధికారితో ఏకాంతంగా గడిపినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే అది నకిలీ వీడియో అని.. తన ప్రతిష్టకు భంగం కలిగించే యత్నమని చెబుతూ సదరు అధికారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. అది ఏఐ జనరేటెడ్ వీడియోగా తేల్చారు. అంతేకాదు.. దానిని అప్‌లోడ్ చేసిన అకౌంట్‌ను గుర్తించిన పోలీసులు, దీని వెనుక ఉన్నవాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు.. ముస్కాన్, సాహిల్ పేరిట కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం విశేషం.