
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటారు. సైన్యంలో చేరడం గర్వకారణమని పలువురు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1949లో జనరల్ కెఎం కరియప్ప(KM Cariappa) భారతదేశ తొలి సైన్యాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. అది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. భారతీయులకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. మన రాజ్యాంగం 1950 నాటికి పూర్తిగా సిద్ధమైంది. అటువంటి పరిస్థితిలో తొలిసారిగా భారత సైన్యానికి చెందిన కమాండ్ ఒక భారతీయుని చేతుల్లోకి వచ్చింది.
బ్రిటీషర్ల పాలన తరువాత ఇది భారతదేశ సైనిక చరిత్రలో ఒక మలుపుగా చెబుతారు. జనవరి 15న జనరల్ కరియప్ప భారత సైన్యానికి నాయకత్వం వహించారు. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే(Army Day) జరుపుకుంటారు. ఆర్మీ డే సందర్భంగా ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో గ్రాండ్ కవాతు నిర్వహిస్తారు. దీనిలో భారత సైన్యం తన ఆధునిక ఆయుధాలను ప్రదర్శిస్తుంది. అలాగే ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, సైనిక విన్యాసాలు నిర్వహిస్తారు. సైనిక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.
సైనిక దినోత్సవం మన వీర సైనికుల లెక్కలేనన్ని త్యాగాలను గుర్తు చేస్తుంది. భారత సైన్యం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా గుర్తింపుపొందింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో కూడా భారత సైన్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతమాతను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులను స్మరించుకునే రోజు ఆర్మీ డే.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు..