
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కోల్డ్‌వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాంగిరీ చేసే వాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ విమర్శలు గుప్పించారు.
అయితే, గౌతమ్ రావును బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్.. పరోక్షంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా రాజాసింగ్.. మీ పార్లమెంట్ నియోజకవర్గానికే ఇస్తారా?. మిగతా పార్లమెంట్‌లో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కనబడటం లేదా?. మీకు గులాంగిరీ చేసేవాళ్లకే పోస్టులు, టికెట్లు అంటూ విరుచుకుపడ్డారు. మిగతావాళ్లు మీకు గులాంగిరి చేయరు కదా అందుకోసం వాళ్లకి పక్క పెడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. దీంతో, బీజేపీలో నేతల మధ్య రాజకీయ మనస్పర్థలు మరోసారి బయటకు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతమ్‌రావును అధిష్ఠానం ప్రకటించింది. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. మే ఒకటో తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.