
సాక్షి, అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తప్పుబట్టారు. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని రద్దుచేసి సరిపెట్టడమేంటని ప్రశ్నించారు. ఆయనపై చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుగ్గిరాలలో ఆర్నెల్లు ఉండకపోతే ఓటివ్వరనే కనీస సూత్రం తెలియని వ్యక్తికి రాజ్యాంగ పదవిలో ఉండే హక్కులేదన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను నిలిపేస్తూ ఆదేశాలివ్వడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుది చిత్తూరు.. నిమ్మగడ్డది గుంటూరు జిల్లా కావడంవల్లే ఇలా అప్రజాస్వామిక నిర్ణయం తీసుకున్నారా అని నిలదీశారు.
ఏకగ్రీవమే వద్దని చంద్రబాబు, నిమ్మగడ్డ తీర్మానించుకుంటే కోర్టుకెళ్లి చెప్పాలని, దమ్ముంటే చట్టాలు తేవాలని జోగి రమేష్ సవాల్ చేశారు. గ్రామీణ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతుంటే వీరికెందుకు దుగ్ధ అని జోగి ప్రశ్నించారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. చంద్రబాబుకు తొత్తుగా, ఆయన రాసే స్క్రిప్టు చదివే వ్యక్తిగా నిమ్మగడ్డ మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారని జోగి రమేష్ తెలిపారు. నిమ్మగడ్డ నిలిపేసినా, ఏకగ్రీవమైన సర్పంచ్‌లంతా కొనసాగుతారని తెలిపారు.