ఉద్యోగులపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి | K Venkata Rami Reddy Comments On Chandrababu Naidu Govt Over Promises To Employees, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి

Published Sun, Jan 5 2025 2:52 PM | Last Updated on Sun, Jan 5 2025 3:51 PM

K Venkata Rami Reddy Comments On Chandrababu Govt

ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు.

సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ ఇస్తామన్నారు. వాలంటీర్లకు నెలకు 10 వేలు జీతం ఇస్తామని చెప్పి విస్మరించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదు’’ అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు.

‘‘కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్‌ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. చిన్న ఉద్యోగులపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. కూటమి వేధింపులు తాళలేక ఐదు మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. వందలాది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

‘‘పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తారో షెడ్యూల్‌ ఇవ్వాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి. వీఆర్‌ఏలకు తక్షణమే జీతాలు పెంచాలి’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబే సుప్రీం.. రెడ్‌బుక్కే రాజ్యాంగం!

చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయమంటున్నారు. ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం?. వేరే ఊరులో ఉండే మహిళా ఉద్యోగులు చీకట్లో వచ్చి ఎలా పెన్షన్లు పంచుతారు?. ఇవ్వకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో మహిళా ఉద్యోగుల గురించి ఎంతో చెప్పారు. కానీ ఆయన శాఖలోనే ఉద్యోగులకు పనిచేసే వాతావరణం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రభుత్వంలోకి తీసుకుంది. గత ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగ నేతలతో సమావేశాలు నిర్వహించేంది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఉద్యోగులను పట్టించుకోలేదు. కనీసం జీతాలు కూడా సరైన సమయంలో వేయటం లేదు

ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల విషయంలో వేధింపులకు దిగుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చేయటంలేదు. పైగా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో వెయ్యి మందిని ఉన్నపళంగా తొలగించారు. ఒత్తిడి తట్టుకోలేక నలుగురు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లుగా మార్చారు. వందలాది మంది ఉద్యోగులకు షోజాజ్ లు ఇచ్చారు. ఆదివారం కూడా పని చేయమని నోటీసులు ఇచ్చారు’’ అని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement