
సాక్షి, నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. నవంబర్ 3న ఎన్నిక జరగగా.. నవంబర్ 6న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందునుంచీ అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు ఆయా పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. రౌండ్ రౌండ్‌కు మారుతూ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ముందుగా చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కించారు. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1352 ఓట్ల ఆధిక్యం రాగా.. రెండో రౌండ్‌లో బీజేపీ 789 ఓట్ల మెజారిటీ సాధించింది.
ఆ తర్వాత మూడు రౌండ్‌లోనూ బీజేపీ 416 ఓట్లతో ఆధిక్యత కనబర్చింది. ఇక నాలుగో రౌండ్‌లో 299 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. టీఆర్‌ఎస్ 26,443, బీజేపీ 25,729, కాంగ్రెస్ 7,380 ఓట్లు సాధించాయి. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సొంతూరి ప్రజలే షాకిచ్చారు. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యంలోకి రావడం గమనార్హం. ఇదిలాఉండగా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సొంత మండలం చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ పుంజుకోవడం గమనించదగ్గ విషయం.
(చదవండి: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు)