
అందరూ అమాయకులే.. కానీ ఉట్టిమీద ఎండు చేపలు మాత్రం ఏమైనాయో తెలీదు. చేయాల్సింది చేసేసి ఇప్పుడు అందరూ.. అయ్యో.. ఇదెక్కడి ఘోరం.. తప్పయింది.. సరిదిద్దుతాం.. మా చేతిడబ్బులు పెడతాం అని ఆస్కార్ స్థాయి నటన చూపుతున్నారు. వాత పెట్టేది వాళ్ళీ.. వెన్నరాసేది వాళ్ళే..
లంబు.. జంబు మాదిరి కేబినెట్‌లో ఈ లోకేష్.. పవన్ భలే తగిలారు.. తిరుమల తొక్కిసలాట మీద లోకేష్.. చంద్రబాబు కిక్కురుమనలేదు కానీ ఎగురుకుంటూ వచ్చి పవన్ సారీ చెప్పారు.. చైర్మన్ నాయుడు కూడా సారీ చెప్పాల్సిందే అని డిమాండ్ చేసారు. ఇప్పుడు పవన్ చేతిలో ఉన్న అటవీశాఖ పరిధిలోని కాశీనాయన సత్రం భవనాలను కడప జిల్లాలో ప్రభుత్వం కూల్చేసింది.. దీనిమీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వేలాదిమంది ఆకలి తీరుస్తున్న అన్నసత్రాలను కూల్చడం ఏమిటని ప్రజలు.. యువత.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో ఇదేదో పెద్ద డ్యామేజ్ అయింది అనుకున్న ప్రభుత్వం వెంటనే రిపేర్లు మొదలు పెట్టింది.
కూల్చేశాక దీనికి సంబంధించి పవన్ ఎక్కడా నోరుమెదపలేదు.. కానీ లోకేష్ లైన్‌లోకి వచ్చి ఎకాఎకిన సారీ చెప్పేసి సొంత డబ్బుతో వాటిని నిర్మిస్తాను అంటున్నారు. అసలు ఆ సత్రాల కూల్చివేత వెనుక కూసే కులపరమైన రాజకీయ విద్వేషం ఉందని అంటున్నారు. కానీ, దానితో సంబంధం లేకుండానే రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకడంతో ఏకంగా లోకేష్ లైన్‌లోకి వచ్చేసారు.
ఆ భవనాలు టైగర్ జోన్‌లోకి వస్తాయి కాబట్టి కూల్చేశారని అది తప్పేనని అంగీకరిస్తూ.. మళ్ళీ వాటిని పునర్నిర్మిస్తామని.. దానికి తన సొంత డబ్బును వెచ్చిస్తానని చెబుతున్నారు. అదెలా సాధ్యం కూల్చినపుడు అవి టైగర్ జోన్‌లో ఉన్నాయ్ అన్నారు.. మరి మళ్ళీ నిర్మిస్తే టైగర్ జోన్‌లోకి రావా?. అది నిబంధనలకు విరుద్ధం కాదా?. అప్పుడు అటవీ చట్టాలు ఒప్పుకుంటాయా అనేది అర్థం కానీ విషయం.
అటవీ మంత్రి సౌండ్ చేయడం లేదేం..
టైగర్ జోన్‌లో ఉన్న భవనాలను కూల్చడం అంటే అది పవన్ కల్యాణుకు తెలిసే జరిగి ఉంటుంది.. లేదా పవన్ కు తెలియకుండా లోకేష్ సారధ్యంలో అయినా అది జరిగి ఉండాలి.. మరి ఇలాంటప్పుడు పవన్ కదా బయటకు వచ్చి దానిమీద స్పందించాలి.. అసలు పవన్ ఎక్కడున్నారో తెలియదు.. శాసనసభ సమావేశాలు మొదట్లో ఒకట్రెండు రోజులు వచ్చిన ఆయన తరువాత ఏమయ్యారో తెలియడం లేదు. తన శాఖ పరిథిలోకి లోకేష్ దూరిపోయి పెత్తనం చేయడం.. ఏకంగా క్షమాపణ చెప్పడం అంటే పవన్ను ఓవర్ టేక్ చేసేయడమే అని స్పష్టంగా తెలుస్తోంది.
సంబంధిత దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ అంశం మీద మాట్లాడారు.. ఆ సంఘటన జరిగి ఉండకూడదన్నారు.. కానీ తన శాఖలో జరిగిన ముఖ్యమైన పరిణామం మీద పవన్ కిక్కురుమనడం లేదు. నాడు తిరుమల తొక్కిసలాట సమయంలో లోకేష్ సౌండ్ చేయలేదు.. పవన్ మాత్రం ఓవర్ యాక్షన్ చేసారు.. నేడు పవన్ చప్పుడు చేయడంలేదు కానీ లోకేష్ మొత్తం మాట్లాడేసి.. దాని విరుగుడు కూడా చెప్పేస్తున్నారు. అంటే అందరూ కూడబలుక్కుని జనాన్ని మోసం చేస్తున్నారా? ఏమి అని సందేహం వస్తోంది.
-సిమ్మాదిరప్పన్న.