
ఇందిరమ్మ డిజైన్లపై నిరుత్సాహం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఇళ్లను మంజూరు చేసిన రెండు నెలలు దగ్గర పడుతున్నా జిల్లాలో కనీసం 30 శాతం మంది లబ్ధిదారులు కూడా ముగ్గు పోసుకోలేదు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు రాగా, ఇందులో 1.36 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. సొంతంగా ఇంటి స్థలం ఆధారంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాలుగా రూపొందించిన విషయం విదితమే. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి అర్హతలున్న వారికి ఈ ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఒక్కో మండలానికి ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేసి..ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఇలా జిల్లాలో మొదటి విడతలో 1,200 మంది లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఈ ఇళ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఇందులో కేవలం 275 మంది లబ్ధిదారులే ముగ్గు పోసుకున్నారు. బేస్‌మెంట్ వరకు కట్టుకున్న లబ్ధిదారులు 21 మంది మాత్రమే కావడం గమనార్హం.