Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Pays Tribute to Dr BR Ambedkar1
అంబేద్కర్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు

సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు.

Chandrababu coalition govt Land Grabbing For Amaravati Capital Expansion2
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్‌’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ లేదా నెగోíÙయేటెడ్‌ సెటిల్‌మెంట్స్‌ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్‌ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

Telangana SC Categorization GO released3
తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ.. రిజర్వేషన్లు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబేదర్క్‌ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక, ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం.. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు ఇలా..గ్రూప్‌-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్‌గ్రూప్‌-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్‌గ్రూప్‌-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనుంది. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్‌ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు.

Sheikh Hasina Says Bangladeshs History Being Erased4
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం

న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్‌ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్‌(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్‌ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్‌(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్‌ మదిలో ‘హైదరాబాద్‌’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

IPL 2025, DC VS MI: Hat Trick Run Outs, For First Time In IPL5
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్‌ రనౌట్స్‌.. చరిత్రలో ఇదే తొలిసారి

ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో అత్యంత అరుదైన హ్యాట్రిక్‌ రనౌట్స్‌ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్‌ ఆరంభ సీజన్‌లో (2008) ఓ సారి ఒకే ఓవర్‌లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్‌లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్‌లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్‌ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్‌ శర్మ (17), కుల్దీప్‌ యాదవ్‌ (1), మొహిత్‌ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం​ సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్‌ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉ‍త్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (59), ర్యాన్‌ రికెల్టన్‌ (41), సూర్యకుమార్‌ యాదవ్‌ (40), నమన్‌ ధీర్‌ (38) రాణించగా.. రోహిత్‌ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్‌ ఫ్రేజర్‌ (0) వికెట్‌ కోల్పోయినా.. అభిషేక్‌ పోరెల్‌ (33), కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్‌ శర్మ (4-0-36-3), మిచెల్‌ సాంట్నర్‌ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్‌లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్‌ ప్లేస్‌ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్‌లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్‌ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు.

Puthandu 2025 History and Significance know all about Tamil New year6
నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం

ఈరోజు (ఏప్రిల్‌ 14) తమిళుల నూతన సంవత్సరం.. తెలుగువారంతా ఉగాది జరుపుకున్న మాదిరిగానే తమిళులు నేడు వారి నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. దీనిని వారు ‘పుతండు’(Puthandu)గా పిలుస్తుంటారు. నేడు తమిళ క్యాలెండర్‌లోని చిత్తిరై నెలలోని మొదటి రోజు. ‘పుతండు’ రోజున తమిళనాడులో కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సవం చేసుకుంటారు. అలాగే రాష్ట్రంలోని వ్యాపారులు ఈ రోజున తమ నూతన ఆర్ధిక సంవత్సర లావాదేవీలను ప్రారంభిస్తారు. దీనిని "కై-విశేషం" అని పిలుస్తారు. కాగా తమిళనాట హిందీని వ్యతిరేకిస్తూ, సొంత భాషకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తున్న తరుణంలో తమిళులంతా తమ భాషలోనే పరస్పరం ‘పుతండు’ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. పురాణాల ప్రకారం పుతండు రోజున బ్రహ్మదేవుడు(Lord Brahma) విశ్వ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అలాగే ఈ రోజునే ఇంద్రుడు భూమిపైకి శాంతి, ఆశ, ఆనందాన్ని తీసుకువచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. తమిళ సంస్కృతిలో ఈ రోజున కొత్త పనులు తలపెడితే శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని చెబుతారు. పుతండును సంగమ యుగం నుంచి జరుపుకుంటున్నారని, ఇది వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉందని చరిత్ర చెబుతోంది. పుతండు రోజున తమిళులు తమ ఇళ్లను కోలం (రంగోలీ)తో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటారు. ‘మంగాయ్ పచ్చడి’ని తింటారు. దీనిని బెల్లం, మామిడి, వేప ఆకులు, ఎర్ర మిరపకాయలతో తయారుచేస్తారు. ఇది జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. ఈ రోజున ఆలయాలను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చేస్తారు.పుతండు ఉత్సవం తమిళులకు కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సమయంగా భావిస్తారు. పుతండు వేడుకలు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. ఈ ఉత్సవాన్ని శ్రీలంక, మలేషియా, సింగపూర్ తదితర తమిళ జనాభా అధికంగా కలిగిన దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు: దళిత రైతు దారుణ హత్య.. ఏడుగురు అరెస్ట్

Indian Movie Capital Not Mumbai Now in Hyderabad Why7
ముంబై పై హైదరాబాద్‌ పై చేయి... ఇండియన్‌ సినిమా అడ్రెస్‌ మారనుందా?

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఇక్కడివాడే, అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు ఇక్కడివాడే, అత్యధిక చిత్రాలు రూపొందేది ఇక్కడే...ఇలాంటి అనేకానేక విశేషాలతో ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్‌కి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌... ఇప్పుడు శరవేగంగా భారతీయ సినిమాకు రాజధానిగా మారిపోతోంది. నిజానికి ముంబై చాలా కాలంగా భారతదేశ చలనచిత్ర రాజధాని అనేది తెలిసిందే, దేశంలో ఏ భాషా చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులైనా, దర్శకులైనా, సాంకేతిక నిపుణులైనా తమ కెరీర్‌లో కనీసం ఒక్కసారైనా హిందీ సినిమా చేయాలని కలలు కంటారు. అలా చేయడం అంటే తమకు ప్రమోషన్‌ వచ్చినట్టుగా భావిస్తారు. ఒకప్పుడు దక్షిణాది సూపర్‌స్టార్లు అనేక మంది హిందీ సినిమాల ద్వారా బాలీవుడ్‌పై తమదైన ముద్ర వేయాలని విఫలయత్నం చేసినవారే.ఆ ఆధిపత్యం ఇక గతం...?అయితే ఇండియన్‌ మూవీపై ముంబై ముద్ర ఇక గతంగా మారనుందా? ఇప్పటిదాకా ముంబై కేంద్రంగా సాగుతున్న భారతీయ సినిమా పరిశ్రమ క్రమంగా హైదరాబాద్‌ తన స్థానాన్ని ఆక్రమించడంతో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.గతంలో, బాలీవుడ్‌ అవకాశాల కోసం చాలా మంది తెలుగు తమిళ నటీనటులు ముంబైకి తరచుగా వచ్చేవారు. అంతేకాదు బాలీవుడ్‌ నటులు, సాంకేతిక నిపుణులు అంటే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్‌ ఉండేది. అక్కడి చిన్నా చితకా నటీనటులు కూడా హైదరాబాద్‌ వచ్చి తెలుగు సినిమాల్లో నటించాలంటే డబుల్, త్రిబుల్‌ ఫీజులు డిమాండ్‌ చేసేవారు. అయినా వాళ్లనే తెచ్చుకుని నిర్మాతలు గొప్పలు చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్‌ రివర్స్‌ అయింది.ఛలో హైదరాబాద్‌...అంటున్న దర్శక నిర్మాతలుతెలుగులో రూపొందిన పాన్‌–ఇండియా చిత్రాల వెల్లువ పరిశ్రమను పునర్నిర్మించింది, హిందీ సినిమాను చాలా పెద్ద మార్కెట్‌లో ఓ చిన్న భాగం గా మార్చేసింది. రాజమౌళి బాహుబలి సిరీస్‌ నుంచి, మనవాళ్లు పాన్‌–ఇండియా చిత్రాల వైపు మళ్లడం మరింత పెరిగింది. అకస్మాత్తుగా ఊపందుకున్న ఈ ట్రెండ్‌తో ఉక్కిరి బిక్కిరవుతున్న ముంబై చిత్రనిర్మాత దర్శకులు ఆ స్థాయి చిత్రాల కోసం దక్షిణ భారత పరిశ్రమపై, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముంబై నుంచి దర్శక నిర్మాతలు ఇక్కడి నటీనటుల కాల్షీట్స్‌ కోసం ప్రయత్నించే క్రమంలో హైదరాబాద్‌ వస్తున్నారు.ముంబైకి చెందిన కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తెలుగు సినిమా నిర్మాతలతో ప్రాజెక్ట్‌ల గురించి చర్చించేందుకు హైదరాబాద్‌కు ఛలో అంటున్నారు.నటీనటులు సైతం అదే బాట...ముంబైకి చెందిన చాలా మంది నటులు నటీమణులు క్రమం తప్పకుండా హైదరాబాద్‌కు వస్తున్నారు, నిర్మాతలు దర్శకులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తెలుగు దర్శకుడు సందీప్‌ వంగా యానిమల్‌ సినిమా ద్వారా బాబీ డియోల్‌కి అందించిన బాక్సాఫీస్‌ హిట్‌ లాగే పాన్‌–ఇండియా చలనచిత్రాలు తమ కెరీర్‌ పునరుజ్జీవనాన్ని అందిస్తాయని ఆశిస్తూ బాలీవుడ్‌లోని అగ్రశ్రేణి నటీనటులు కూడా హైదరాబాద్‌కు చెందిన చిత్ర నిర్మాత దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు.తిరిగొస్తున్న వలస ప్రముఖులుదూరపు కొండల నునుపును చూసి ముచ్చటపడిన పలువురు దర్శకులు, నటీనటులు తూచ్‌ అనుకుంటున్నారు. గతంలో దర్శకుడు పూరీ జగన్నాధ్, ముంబైలో స్థిరపడాలని భావించాడు. అయితే తిరిగి హైదరాబాద్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ అవకాశాలు బాగున్నా సరే బాలీవుడ్‌ ఛాన్సుల కోసం పెట్టె బేడా సర్ధుకున్న పలువురు తారలు సైతం తిరిగి హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, మళయాళ చిత్రాలు సైతం భారతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్నాయి. ఇలా మొత్తంగా దక్షిణాది చిత్రాలు భారీ విజయాలు నమోదు చేస్తున్న నేపధ్యంలో ఏర్పడిన పరిస్థితి హైదరాబాద్‌కు లాభించిందని చెప్పాలి. మిగిలిన ఏ దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమకూ హైదరాబాద్‌ లాంటి వైవిధ్యభరిత అవకాశాలు అందించే అత్యాధునిక నగరం లేకపోవడం కూడా మరో కారణం. ఇటీవల బాలీవుడ్‌ తారలు, ప్రముఖులు హైదరాబాద్‌లో రెస్టారెంట్లు, జిమ్స్, బొటిక్స్‌ తదితర వ్యాపారాలు ప్రారంభిస్తూ హైదరాబాద్‌కు తరచుగా రాకపోకలు సాగించేందుకు మరికొన్ని కారణాలు సృష్టించుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారాల్లో టాలీవుడ్‌ ప్రముఖులు సైతం పార్ట్‌నర్స్‌గా మారుతున్నారు.

Tariff Uncertainty Short Lived Revenue Bookings Strong TCS CEO8
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్‌ సీఈవో

ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) సీఈవో, ఎండీ కె.కృతివాసన్‌ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్‌ బుక్‌ భవిష్యత్‌ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్‌ పైప్‌లైన్‌ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్‌వేర్‌ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్‌ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం!

DRDO laser-based weapon demonstration success at Kurnool9
కర్నూలులో డీఆర్‌డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్‌.. భారత్‌ సరికొత్త రికార్డు

కర్నూలు: భారత అమ్ములపొదిలోకి సరికొత్త లేజర్ అస్త్రం చేరనుంది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఏపీలోని కర్నూలు జిల్లా వేదికైంది. ఈ సందర్బంగా 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతమైంది.వివరాల ప్రకారం.. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుతమైనన లేజర్‌ వ్యవస్థను డీఆర్‌డీవో తీసుకువచ్చింది. కర్నూలులోని ఓర్వకల్లులో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌లో ఆదివారం ప్రయోగం జరిగింది. ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మిస్సైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో లేజర్ కిరణం తాకగానే, లక్ష్యంగా ఉన్న వస్తువు కాలి బూడిదైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీంతో, ఇలాంటి వ్యవస్థ కలిగిన అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన భారత్‌ చేరింది. ఇజ్రాయెల్‌ సైతం ప్రయోగాలు చేస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలను డీఆర్‌డీవో ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.CHESS DRDO conducted a successful field demonstration of the Land version of Vehicle mounted Laser Directed Weapon(DEW) MK-II(A) at Kurnool today. It defeated the fixed wing UAV and Swarm Drones successfully causing structural damage and disable the surveillance sensors. With… pic.twitter.com/U1jaIurZco— DRDO (@DRDO_India) April 13, 2025అయితే, ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌ సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (CHESS) అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు సైతం ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ ఆయుధానికి MK-2(A) DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో ఈ అస్త్రం తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చాటినట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. చాలా దూరంలో ఉన్న ఫిక్స్‌డ్‌ వింగ్‌ డ్రోన్లను నేలకూల్చింది. అదే విధంగా డ్రోన్ల దాడిని తిప్పికొట్టింది. ‘శత్రువుల’ నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసి, మెరుపువేగంతో సెకన్లలోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని చాటింది. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025

African Djembe Drummin Has Many Health Benefits10
సరికొత్త మ్యూజిక్‌ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!

ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్‌ డ్రమ్‌ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్‌ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది. చక్కని సంగీతం వినడం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే సంగీత వాయిద్యాన్ని పలికించడం కూడా అంతకు మించిన ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని జెంబే నిరూపిస్తోంది. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా మాల్స్‌లో సర్వసాధారణంగా జెంబే సంగీత కార్యక్రమం ఇప్పుడిప్పుడే నగరంలోనూ ప్రాచుర్యం పెంచుకుంటోంది. డ్రమ్‌ మారో డ్రమ్‌.. సంగీత పరికరమైన డ్రమ్‌ – దాని అంతర్గత లయ స్వభావం కారణంగా – దానిని పలికించే వారికి ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గిటార్‌ లేదా హార్మోనికాతో పోలిస్తే సరళమైన సంగీత వాయిద్యం డ్రమ్స్‌. దీనిని పలికించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సైకోథెరపిస్ట్‌ నీతా మాట్లాడుతూ, ‘డ్రమ్‌ శిక్షణ స్ట్రోక్‌ పేషెంట్లకు పార్కిన్సన్స్‌ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపయుక్తం. నడక, చేయి నియంత్రణ ద్వారా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి కదలికల్లో ఖచ్చితత్వం, వేగం, సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది’ అంటున్నారు. ‘ఇది మెదడులో డోపమైన్‌ స్థాయిలను పెంచుతుంది. అయితే అధికంగా డ్రమ్మింగ్‌ మీద ఆధారపడితే మాత్రం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు’ అని కూడా నీతా చెబుతున్నారు. ఒంటరిగా డ్రమ్మింగ్‌ చేయడం ఏకాగ్రతను పెంచుతుంది, లోతైన శ్వాస ద్వారా మెరుగైన ఆక్సిజన్‌ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సమన్వయ శక్తిని పెంచుతుంది. ప్రస్తుతంలో జీవించడం (మైండ్‌ ఫుల్‌ నెస్‌) సాధనలో సహాయపడుతుంది. స్నేహితులు లేదా ఇతరులతో కలిసి ప్లే చేయడం ఉత్తమ మార్గం. ఇందులో పాల్గొనేవారు అతని/ఆమె సౌలభ్యం, నైపుణ్యం ప్రకారం వాయిద్యాన్ని పలకిస్తారు కాబట్టి ఇది బంధాలను బలపరుస్తుంది, సహనాన్ని అలవరుస్తుంది. అపరిచితులను ఒకచోట చేర్చడం ద్వారా నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తులకు ఆ ఫీలింగ్‌ పోయేలా చేస్తుంది. ఆఫ్రికాలో సందేశాలు పంపే సంగీతం.. జెంబే పశ్చిమ ఆఫ్రికాలో, ముఖ్యంగా మాలి, గినియా ఐవరీ కోస్ట్‌ ప్రాంత మూలాలను కలిగి ఉంది. వివాహాలు, దీక్షా ఆచారాల వంటి ఉత్సవ సందర్భాల్లో ఈ డ్రమ్‌ వాయించడం సంప్రదాయం. వీటి ధ్వని మైళ్ల దూరం వినబడుతుందట. అందుకని, సుదూర ప్రాంతాల్లో ముఖ్యమైన సందేశాలను చేరవేయడానికి కూడా ఉపయోగిస్తారట. కాలక్రమేణా, జెంబే ఆఫ్రికా ను దాటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రాచుర్యం పొందిన వాయిద్యాల్లో జెంబే ఒకటి. గోబ్లెట్‌ ఆకారపు ఈ డ్రమ్‌ ఆఫ్రికాలోని డిజాలా/లెంకె చెట్టుకు చెందిన సింగిల్‌ పీస్‌ హార్డ్‌ వుడ్‌తో తయారవుతుంది. పైభాగం.. అంటే డ్రమ్‌హెడ్‌ గొర్రె/జంతు చర్మంతో రూపొందుతుంది. పెర్కుషన్‌ వాయిద్యం.. ఆరోగ్యమార్గం.. ‘దక్షిణాఫ్రికా నుంచి వచి్చన జెంబే ఒక పెర్కుషన్‌ వాయిద్యం. జాజ్, తబలా మృదంగం పెర్కుషన్‌ రంగంలో బాగా తెలిసిన ఎంపికలు అయితే, జెంబే నన్ను ఆకర్షించింది. అప్పటికే దీనిలో రాణిస్తున్న ఓ దక్షిణాఫ్రికా స్నేహితుడి ప్రోద్బలంతో దీన్ని సాధన చేశాను. సంగీతంలో పీహెచ్‌డీ చేశాను. మన శరీరంలోని ఏడు చక్రాల ప్రాముఖ్యతను నేను గుర్తించాను. నగరంలో తొలిసారి జెంబే ద్వారా మ్యూజికల్‌ థెరపీని పరిచయం చేశాను. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడి నిర్వహణలోనూ ఉపకరిస్తుంది. లయ ఆనందం ద్వారా ప్రజలను కనెక్ట్‌ చేసే అద్భుతమైన వాయిద్యం జెంబే. అన్ని వయసుల వారికీ సంగీతం తాలూకు మ్యాజిక్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొంతకాలంగా నగరంలోని పాఠశాలలు కళాశాలల్లో ప్రదర్శనలు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. – సాయి కుమార్, ది జెంబే సర్కిల్‌ వ్యవస్థాపకుడు ఎవరికి నప్పదు.. అంటే.. పెద్దపెద్ద శబ్దాలకు వ్యతిరేకంగా స్పందించే స్వభావం కలిగినవారు.. అలాగే.. భుజం కీళ్లు, మోచేతులు లేదా మణికట్టుకు గాయాలు, లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి ఈ జెంబే నప్పదు. అలాగే కార్డియో యాక్టివిటీని తక్కువగా మాత్రమే చేయాలని వైద్య సలహా పొందిన వారు కూడా దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది. (చదవండి: అక్కడ న్యూ ఇయర్‌కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement